వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భందంలో ఇరుక్కుపోయాయి. ఇక రోడ్లు అయితే చెరువులను తలపించాయి. భారీవర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో ఎక్కడ అడుగుపెడితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు.. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదలడంతో వరద ఉద్ధృతి పెరగడంతో ఒక్కసారిగా మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పెరిగిపోయింది. బ్రిడ్జిని ఆనుకుని మరీ వరద నీరు ప్రవహిస్తుండటం, మూసి వాగు ప్రమాద స్థాయిలో ఉన్నందున అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో అధికారులు తాత్కాలికంగా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి  మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేశారు. పరిస్థితిని బట్టి రాకపోకలను అనుమతించనున్నారు. మరో మూడురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ములుగు, ఖమ్మం, నల్లగొండ, జయశంకర్-భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా... ఏపీలో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుగుణంగా ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ముందు జాగ్రత్త హెచ్చరికలను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా ముండ్లమర్రులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరంలో 8, నంద్యాల జిల్లా ఆత్మకూరు, డోన్‌లో 6, బాపట్ల జిల్లా కారంచేడులో 5 సెంటీమీటర్ష చొప్పున వర్షం కురిసింది. రాయలసీమలో పలుచోట్ల, కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ఇదిలావుండగా ... హైదరాబాద్ నగరంలో ...  నిన్న గాక మొన్న ఓ మహిళ నాలాలో గల్లంతు కావడం, నిన్న ప్రగతినగర్‌లో నాలుగేళ్ల చిన్నారి బాలుడు నాలాలో పడి చనిపోవటంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనలు మరువక ముందే నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవినగర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి ఫిరోజ్‌గూడలోని మాధవి నగర్‌లో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షం తగ్గడంతో ఇంట్లో ఉన్న నీటిని తొలగించిన నిషాద్ బేగం ఇంట్లో ఫ్యాన్స్ స్విచ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడింది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో బేగం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నగరంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో... పోలీసు, ఇతరశాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos