ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసును మరో వారం రోజులపాటు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కేసు నమోదుతో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి.. ఏసీబీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును అభ్యర్దించారు. ఏసీబీ దర్యాప్తుపై కూడా స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే. వాదనల సమయంలో ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఈ క్రమంలో...కేటీఆర్‌ను వారం రోజుల పాటు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రాజకీయ వివాదంగా మారిన ఈ కేసు పైన అసెంబ్లీలో నిరసనలు హోరెత్తాయి. ఏ-1గా కేటీఆర్ పేరు నమోదు చేయటం తో కేటీఆర్ ఈ కేసు పైన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. రాజకీయ కుట్రలో భాగంగా నే ఈ కేసు నమోదు చేసారని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఫార్ములా ఈ రేసు నుంచి స్పాన్సర్లు తప్పుకోవటంతో హెచ్ఎండీఏ ద్వారా ఎఫ్ఈఓ కు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసు కొట్టివేయాలని కోరారు.
14 నెలల తరువాత దీనిపై కేసు నమోదు చేయటం రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ఫార్ములా రేసు ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పేర్కొన్నారు. పిటీషన్ లో ఏసీబీతో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్‌ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్‌కు ముందు నిధులు ఎఫ్ఈవో పంపడం ఉలంఘన కాదన్నారు. దీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదని వాదనల్లో పేర్కొన్నారు. అయితే, ఇది అత్యవసర కేసు కాదని, కేటీఆర్ కు జరిగిన లబ్ది ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. గవర్నర్ ఇచ్చిన అనుమతి పత్రాలను న్యాయమూర్తి పరిశీలించారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం.. కేటీఆర్ పై వారం రోజుల పాటు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos