సినిమాలకు ప్రేక్షకులు రాకపోతుండటంతో చాలా థియేటర్లు మూగబోతున్నాయి. దేశంలో ఎక్కడో కాదు... తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అందుకే మల్టీప్లెక్స్ గ్రూపులు ఒక స్కీము ప్రవేశ పెట్టాయి. చిన్న హీరోల సినిమాలకి చిన్న టికెట్ల స్కీము అమలు చేస్తున్నాయి. పెద్ద స్టార్డమ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ లాంటి బిగ్ స్టార్లు ఉంటేనే.. ప్రేక్షకులు సినిమాలకు వస్తున్నారు. చిన్నసినిమాల వైపు ప్రేక్షకులు అస్సలు చూడకపోవడంతో ఈ స్కీమ్ ప్రవేశపెట్టక తప్పలేదు. గత ఆరునెలల సినిమా రివ్యూ తీసుకుంటే... చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, నాని నటించిన దసరా వంటి సినిమాలకే ప్రేక్షకులు పోటెత్తారు.
దీంతో థియేటర్లు కళకళలాడాయి. సినిమా ఎంతో బావుందని టాక్ వస్తేనే... చిన్న హీరోల సినిమాలైన... సాయిధరం తేజ్ ‘విరూపాక్ష’, సుహాస్ ‘పద్మభూషణ్’, ప్రియదర్శి ‘బలగం’ పిక్చర్స్ కు థియేటర్లు నిండాయి. కానీ గోపీచంద్, అల్లరి నరేష్, నాగశౌర్య, విశ్వక్ సేన్, సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోల కొత్త సినిమాలకైతే జనమే లేరు. ఇలాటి సినిమాలే ఎక్కువ ఉన్నాయి. దీంతో గరిష్ట కాలం థియేటర్లు బోసిపోయే ఉంటున్నాయి. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు తీస్తేనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక థియేటర్ల లోపల పార్కింగులు, పాన్ షాపులు, తినుబండారాల స్టాల్సు సంగతి చెప్పక్కర్లేదు.
రేపు 16 న బిగ్ మూవీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ‘ఆది పురుష్’ విడుదలతో దేశవ్యాప్తంగా థియేటర్లకి మళ్ళీ పండుగ వాతావరణం వచ్చేస్తుంది. కానీ... ఇలా బిగ్ మూవీస్ ఎన్నని వస్తాయి. అందువల్లనే... మల్టీప్లెక్స్ గ్రూపులు చిన్న హీరోల సినిమాలకి చిన్న టికెట్ల స్కీము ప్రవేశపెట్టాయి. పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘జరా హట్కే జరా బచ్కే’, హాలివుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్’ కు ఈ స్కీముని అమలుచేసి మంచి బాక్సాఫీసు ఫలితాలు సాధించింది. నిర్మాతలు, పంపిణీదారులు చిన్న సినిమాలని తక్కువ టికెట్టు ధరలతో ప్రదర్శించాలని కోరుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవ్వరూ నష్టపోకుండా... ఈ ఐడియా బాగుంది కదూ.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos