తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఒక పార్టీలోని నేతలు మరో పార్టీలోకి జంప్ అవుతూ రాజకీయ పరిణామాలనే మార్చేస్తున్నారు. ఇప్పుడు జనగామ నియోజకవర్గం సడెన్ గా రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జనగామకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత  మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేసి బిగ్ షాక్ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేస్తూ... తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల ఎప్పటినుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న వేళ పొన్నాల లక్ష్మయ్య అసహనంతో పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా కలిగించింది.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీకి తొలి పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. జనగామ నుంచి నాలుగుసార్లు పొన్నాల ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పొన్నాల లక్ష్మయ్య 1989లో తొలిసారి గెలుపొంది నేదురుమల్లి కేబినెట్‌లో సుదీర్ఘకాలం నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 1999, 2004, 2009లలో కూడా గెలుపొందారు. 2004లో వైఎస్‌ కేబినెట్‌లో కూడా మంత్రిగా సేవలందించారు. అనంతరం రోశయ్య, కిరణ్‌ కేబినెట్‌లలోను మంత్రిగా కొనసాగారు. 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో భాగంగా చేర్యాల నియోజకవర్గం రద్దై జనగామ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక... టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం జనగామలో 2014లో భారీతేడాతో ఓడిపోయారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఆశించినా, ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమి పాలవడం ఆ పార్టీకి అప్రతిష్టగా మారింది. ఆ ఎన్నికల్లో పొన్నాల ... టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో 32,695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ-టీడీపి కూటమి అభ్యర్థిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి 21,113 ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో కూడా జనగామ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఇదిలావుండగా... ఈ సారి పొన్నాలకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవచ్చని... కొమ్మూరి ప్రతాప్ రెడ్డికే టికెట్ అవకాశాలు ఉన్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో బీసీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ... 2018లో కూడా చివరి నిమిషం వరకు ఎటూ తేల్చకుండా తనను అవమానించారని ... చివరి క్షణాల్లో చాలా ఆలస్యంగా టికెట్‌ ఖరారు చేశారని... దీనివల్ల అప్పట్లో నేను గెలిచే అవకాశం కోల్పోయానని ఆయన అంటున్నారు. కాగా... జనగామలో ఏడుసార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు, ఆరుసార్లు బీసీ మున్నూరుకాపు అభ్యర్ధులు గెలిచారు. రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఎస్సీలు గెలుపొందారు. జనగామలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి తొమ్మిదిసార్లు, సీపీఎం రెండుసార్లు, టీడీపీ ఒకసారి, టీఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి పీడీఎఫ్‌ గెలిచింది. కాగా... కాంగ్రెస్ ను వీడిన పొన్నాల లక్ష్మయ్య ... త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లుగా చెబుతున్నారు. అక్కడ ఆయనకు పదవీపరంగా ఎలాంటి హామీ లభించిందోననే చర్చ జోరుగా సాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos