ఢిల్లీ వేదికగా కొత్త పొత్తు రాజకీయం ప్రారంభమైంది. నిన్న మొన్నటి దాక కస్సు బుస్సులాడుకున్న రెండు పార్టీలు... ఇప్పుడు పొత్తు దిశ గా పయనిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఏవో కాదు.. బీజేపీ, జేడీఎస్ పార్టీలే. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకప్పుడు దక్షిణాదిలో తమకు బలమైన కోటగా ఉన్న కర్ణాటకలో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుపార్టీల నేతలు కీలక చర్చలు జరిపారు. తాజాగా జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ రోజు శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉందని... ఎన్డీఏ లోకి జేడీ ఎస్ చేరికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. తాము ఇప్పటివరకు సీట్లు కేటాయింపు గురించి చర్చించలేదని, ఈ విషయంలో బీజేపీ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని కుమారస్వామి తెలిపారు. కర్ణాటక లోని మొత్తం 28 లోక్సభ స్థానాలలో ప్రస్తుత పరిస్థితి గురించి వివరంగా చర్చిస్తామనీ, అంతకుముందు ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉందనీ, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమిటనే విషయాన్ని కూడా సవివరంగా చర్చిస్తామని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన జేడీఎస్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప.. జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ క్రమంలో జేడీఎస్, బీజేపీ నేతల మధ్య జరిగే భేటీలో పొత్తుపై క్లారిటీ రానుంది. కాగా, జేడీఎస్-బీజేపీ పొత్తుపై కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య మండిపడుతున్నారు. వారి పొత్తు అనైతికమని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos