కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం ఏపీ కేంద్రంగా కొత్త లెక్కలు మొదలు పెట్టింది. పార్లమెంట్ రెండో విడతలో జమిలి.. నియోజక వర్గాల పునర్విభజన బిల్లులు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర కేబినెట్ విస్తరణకు సమాయత్తం అవుతోంది. కాగా.. ప్రస్తుతం ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలతో పాటుగా త్వరలో మరిన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభకు తమ అభ్యర్ధిగా ఊహించని నిర్ణయంతో సిద్దం అవుతున్నట్లు సమాచారం.

రాజ్యసభ సభ్యుల విషయంలో బీజేపీ తొలి నుంచి కూటమిలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ కోటాలో ఇద్దరు బీజేపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆర్ క్రిష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీట్లు కేటాయించింది. కాగా.. త్వరలో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. త్వరలోనే ఈ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే టీడీపీకి రెండు, బీజేపీ, జనసేన లకు చెరొక స్థానం తీసుకునేలా నిర్ణయం జరిగింది. టీడీపీ నుంచి సానా సతీష్ కు మరొకసారి పదవిని రెన్యువల్ చేయనున్నారు. రెండో స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుంది. అయితే, బీజేపీ మాత్రం జాతీయ స్థాయి లెక్కల ఆధారంగా ప్రతీ సీటు విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ కోటాలో మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు కూడా గతంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఉండి పదవీ విరమణ చేశారు. జీవీఎల్ గత ఎన్నికల్లో విశాఖపట్నం టిక్కెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా అది టీడీపీకి వెళ్లింది. దీంతో జీవీఎల్ నరసింహారావు పేరు కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది. అయితే, సామాజిక వర్గాల లెక్కల్లో కిరణ్ కుమార్ రెడ్డి పేరు రేసులోకి వచ్చిందని చెబుతున్నారు. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో SC వర్గీకరణ చట్టం అమలు అయిన నేపథ్యంలో మంద కృష్ణ మాదిగకు ఆ స్థానం దక్కనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు BJP నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మంద కృష్ణ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సీటు ఖరారు పైన అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Videos