తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల్లోనూ హడావుడి పెరిగిపోయింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసి... గేమ్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ... ఇప్పటికీ... అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోస్తోంది. రేపో మాపో పేర్లను ఖరారు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు పార్టీలు ఇంత హంగామా చేస్తున్నా... బీజేపీ మాత్రం నింపాదిగా ఉంటూ... ఎలాంటి ఉలుకుపలుకూ లేకుండా సైలెంట్ గా ఉంటోంది. మరోవైపు ఎన్నికల సంఘం అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
అయితే ... రాష్ట్రంలో రాజకీయ పార్టీల విచిత్ర పోకడలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం... అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు ... ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా... ఏదో తెలియని గందరగోళంలో ఉన్నారేమోనని అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు రాబోయేది మా ప్రభుత్వమే అంటూ... దూకుడు మీద ఉన్న కమలనాథులు... ప్రస్తుతం డీలా పడి పోయి... ఉత్తేజం కోల్పోయి ఇన్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత... అసమ్మతి పెరిగి.. గులాబీదళంలో లుకలుకలు మొదలవుతాయని... అది తమకు కలిసొస్తుందని కాషాయపార్టీ ఏవేవో లెక్కలు వేసుకుంది. అయితే బీజేపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయి.
వారు ఊహించినట్లుగా... గులాబీదళంలో చీలికలు పేలికలు రాలేదు. ఆ పార్టీ నేతల్లో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడలేదు. వీటన్నింటిని ముందే పసిగట్టిన కేసీఆర్ ... అవేవీ చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే... 119 నియోజకవర్గాలకు వెయ్యికి పైగా అంటే సుమారు 1025 దరఖాస్తులు రావడంతో ... ఆ పార్టీ నాయకత్వం కూడా ఖుషీఖుషీగా ఉంది. ఇంత రెస్పాన్స్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఊహించలేదు. దీంతో అభ్యర్థులపై సర్వే నిర్వహించి... సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తోంది.
ఇక బీజేపీలో మాత్రం ఏ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై...ఇప్పటికీ క్లారిటీ లేదు. అసలు 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారా అన్న దానిపైనే సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీలో కూడా కాంగ్రెస్ లాగే ఎలక్షన్ కమిటీ ఉంది. బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ఇన్‌చార్జిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కన్వీనర్‌గా ఉన్నారు. ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ అంటూ ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా మరో కమిటీ వేసినా.. బీజేపీలో అభ్యర్థుల ఎంపికపై ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదు. ఎలక్షన్ కమిటీయే అభ్యర్థుల ఎంపిక చూస్తుందని బీజేపీ వర్గాల చెబుతున్నాయి. ఈ కమిటీ ఇన్‌చార్జిగా ప్రకాశ్ జవదేకర్ ఒకసారి హైదరాబాద్ వచ్చివెళ్లారే కాని అభ్యర్థుల ఎంపికపై ఎలా ముందుకు వెళ్లాలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీలో ఇంకా ఎన్నికల జోష్ కనిపించడం లేదు. ఈ క్రమంలో... బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ముఖ్య నేతలు, గెలిచే, గణనీయంగా ప్రభావం చూపే వారు ఎవరెవరన్న విషయాన్ని ఆరా తీస్తోంది. అందులో గెలిచే అవకాశాలు ఉండీ... టికెట్లు దక్కనివారిని బీజేపీలోకి చేర్చుకుని, బరిలోకి దింపే అవకాశాలను పరిశీలిస్తోంది. తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఎన్నికల లెక్కలు వేసుకుంటున్న వేళ... ఎవరి అంచనాలు ఎలా ఫలిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos