భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఓ భారత జవాన్ పాకిస్తాన్ బలగాలకు చిక్కాడని తెలిసిందే. అయితే ఆ బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్స్ భద్రంగా అప్పగించాయి. ఏప్రిల్ 23న సరిహద్దు దాటిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ ను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు పాక్ సైన్యం బీఎస్ఎఫ్ జవానును తిరిగి భారత్‌కు అప్పగించింది. 20 రోజుల తర్వాత భారత జవానును అటారీ, వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. దాంతో ఇరుదేశాల మధ్య ఓ వివాదం సమసిపోయినట్లయింది.
ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ నేపాల్ వ్యక్తి సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. కానీ పాక్ మీద ఎలాంటి కాల్పులు, ప్రతిదాడులు చేయలేదు. అదే సమయంలో పాక్ జవాన్లు, ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద సరిహద్దుల్లో అమాయకులపై కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఓ జవాన్ పొరపాటున పాకిస్థాన్ ఆర్మీ చేతికి చిక్కాడు.
భారత సరిహద్దు భద్రతా దళం - BSF జవాన్ పూర్ణం కుమార్ షా పొరపాటున పంజాబ్ సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే షాను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 23, 2025న ఫిరోజ్‌పూర్ సరిహద్దు అవతల నుంచి బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షా పాక్ లోకి ప్రవేశించాడు. అతడి విడుదల కోసం రెండు దేశాల ఆర్మీ మధ్య చర్చలు జరిపింది. కానీ మరోవైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై ఉక్కుపాదం మోపింది. సింధు జలాల ఒప్పందంపై నిషేధం, సరిహద్దు మూసివేత, పాక్ జాతీయులకు అన్ని రకాల వీసాలు రద్దు చేయడం, భారత హైకమిషన్ లో సిబ్బందిని తగ్గించడం లాంటి చర్యలు చేపట్టింది. దాంతో బీఎస్ఎఫ్ జవాను విడుదల అంశం సైడ్ అయి, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.
ఈ క్రమంలో.. తన భర్త పాక్ లో చిక్కుకున్నాడని ఆయనను క్షేమంగా తిరిగి తీసుకురావాలని గర్భిణి అయిన బీఎస్ఎఫ్ జవాను భార్య ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు మూడు వారాల తరువాత బీఎస్ఎఫ్ జవానును పాక్ రేంజర్లు అటారీ, వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు క్షేమంగా అప్పగించడంతో కథ సుఖాంతమైందని భారత్ బలగాలు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos