పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి  ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో రేపు ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతోపాటు మొత్తం 16 ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

ఈసారి బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి అంటే ఇవాళ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాలు  మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ జరగబోతున్నాయి. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండటం ఇది వరుసగా 8వ సారి కావడం విశేషం. కాగా, ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిన్న గురువారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కూడా ఉంది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలకు స్పష్టం చేశారు. సభ సజావుగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ సహా విపక్షాలు మాత్రం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటతోపాటు నిరుద్యోగం, తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాలు కూడా వాడీవేడిగానే సాగనున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos