దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎంతోకాలంగా... ఒకే దేశం... ఒకే ఎన్నిక నినాదం వినిపిస్తున్న క్రమంలో... జమిలీ ఎన్నికల నిర్వహణకు కసరత్తులు ముమ్మరం చేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణలో భాగంగానే ఈ నెలలో ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని.. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్ , వన్ ఎలెక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు, యునిఫామ్ సివిల్ కోడ్ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే...అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదే సమయంలో జమిలీ ఎన్నికలపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం లేటెస్ట్ పొలిటికల్ డెవలప్ మెంట్ గా విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకూ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఈ ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లు పాస్ అయితే.. రాష్ట్రాలకు, లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. లోక్‌సభ సభ్యుల్లో 67 శాతం మంది, రాజ్యసభ సభ్యుల్లోనూ 67 శాతం మందితో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో 50 శాతం మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే కేంద్రం ప్రతిపాదనపై విపక్షాలు మండి పడుతున్నాయి. వాస్తవంగా... 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణే ఆనవాయితీగా ఉండేది. అలాగే నాలుగు ఎన్నికలు ఇదే పద్ధతిలో జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేశాక ఈ విధానం రద్దయినట్లయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా, షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేశారు. అలాగే 1971లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో తిరిగి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల భారీగా ఖర్చు ఆదాతో పాటు అభివృద్ధిపై సానుకూల ప్రభావం పడుతుందని చెబుతోంది. ఇప్పుడు తాజాగా... జమిలీ ఎన్నికలపై పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos