తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వేగం పుంజుకుంటుండటంతో క్యాడర్ లో హుషారు పెరిగింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత దేశవ్యాప్తంగా ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. అధిష్టానం కూడా అందుకు తగ్గట్టుగా పార్టీ పున:వైభవానికి పకడ్బందీగా స్టెప్పులు వేస్తోంది. తెలంగాణలో ఇటీవల కాలంలో ఒక్కసారిగా బీజేపీ స్పీడ్ తగ్గగా... కాంగ్రెస్ దూకుడు పెరిగింది. ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే బీఆర్ఎస్- బీజేపీ ల మధ్య అనూహ్యంగా మాటల యుద్ధం తగ్గింది.
రాష్ట్రస్థాయిలో బీఆర్ఎస్ స్వరం మారుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా బీజేపీ పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వైఖరి వైఖరిలో మార్పు వచ్చినట్లుగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ఇచ్చినట్లుగా భావిస్తున్న కాంగ్రెస్ నే టార్గెట్ గా చేసుకుని విమర్శల దాడి పెంచారు. నిన్నమెున్నటి వరకు బీజేపీ పై విరుచుకుపడిన బీఆర్ఎస్ ద్వితీయ, తృతీయస్థాయి నేతలు కూడా... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆసక్తి చూపుతుండటం.. ఆ పార్టీలో చేరుతున్న వారు పెరుగుతుండటం వంటి కారణాలు కూడా బీఆర్ఎస్ ను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇదే కంటిన్యూ అయితే... క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేని బీజేపీ కంటే.. కాంగ్రెస్ తోనే ఎక్కువ ప్రమాదమని బీఆర్ఎస్ గుర్తించినట్లుంది. అందుకే కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శల వాడి పెంచింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో తెలంగాణ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ... అలా అందరూ కలిసి ఐకమత్యంగా పాల్గొంటున్నారు.
మరోవైపు.. ఆపరేషన్ కమలం పెద్దగా వర్కవుట్ కాకపోగా... ఆపరేషన్ కాంగ్రెస్ సక్సెస్ అవుతుండటం ఆశ్చర్యకరం. ఇప్పటికే బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరేలా మంతనాలు జరిగాయి. ఇక.. రేపో మాపో వారు హస్తం గూటికి చేరనున్నారు. వీరితో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డిలు సైతం హస్తం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం. మరోవైపు తాండురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో విభేదాలు ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందనే సంకేతాలు ... ప్రజలు, ఇతర పార్టీల క్యాడర్, లీడర్లలోకి పంపించడంలో కాంగ్రెస్ విజయవంతమవుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న క్రమంలో... కాంగ్రెస్ హైకమాండ్ లోని ప్రియాంక గాంధీ తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదే జోరు కొనసాగితే... వచ్చే ఎన్నికల్లో ట్రై యాంగిల్ పోరు కాదు... బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏంజరుగుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos