తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దూకెందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడు పెంచగా... కాంగ్రెస్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఓవైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుండగా... మరోవైపు కీలకమైన సీడబ్యూసీ భేటీని హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ విజయభేరి పేరుతో ఈ నెల 17న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు భారీఎత్తున జనాన్ని సమీకరించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .... పార్టీ నేతల సహకారంతో సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి జనాన్ని తరలించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేయాలని… అన్ని నియోజకవర్గాల్లో స్థానిక కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందుకు తగ్గట్టే స్థానిక నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. భారీగా జనం తరలించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. కాగా... ఈ సభావేదిక నుంచే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారని... పార్టీ అగ్రనేత సోనియాగాంధీ 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీతో కీలకమైన ప్రకటనలు చేయించటం ద్వారా…. బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని టీపీసీసీ భావిస్తోంది. మరోవైపు ఈ సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతి సులువుగా లభిస్తుందా లేదా అనుకుంటున్న తరుణంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పందించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరుపుకోవచ్చని ... సభకు వచ్చే వారి సంఖ్య 10 వేలకు మించరాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేయరాదని, సభతో సామాన్య పౌరులకు ఇబ్బంది కలగరాదని, ఆ విషయాన్ని నిర్వాహకులే చూసుకోవాలని, రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయరాదంటూ ఇలా ... 25 షరతులతో కాంగ్రెస్ విజయభేరి సభకు అనుమతి ఇచ్చారు. ఇదిలావుండగా ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీకి నాలుగున్నర కోట్ల రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా బహిరంగ సభ జరిగే రోజుకన్నా ఒకరోజు ముందు అంటే ఈ నెల 16న హైదరాబాద్‌లోని తా‌జ్‌కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos