సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తప్పుపట్టాయి. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ వ్యాఖ్యలను నిన్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లో తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి దిలీపాచారి కూడా రియాక్ట్ అయ్యారు. దిలీపాచారి మాట్లాడుతూ... ఉదయనిధి దేశద్రోహి అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధిని నిర్మూలించిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం ప్రతీక అని చెప్పారు. దేశ ప్రజల మధ్య ఐకమత్యం కోసం బీజేపీ తాపత్రయ పడుతోందని... ద్రావిడం, సంస్కృతం అంటూ ప్రజల మధ్య విభేదాలను సృష్టించి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హిందువులంతా ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవారిని క్షమించకూడదని చెప్పారు. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు చెందిన సాధువు ఒకరు ఉదయనిధి తలను తెచ్చిచ్చిన వారికి రూ.10 కోట్ల నజరానా ఇస్తానని ప్రకటించారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకుంటే తానే స్వయంగా ఉదయనిధిని వెతికి పట్టుకుని ఆ పని పూర్తి చేస్తానని చెప్పారు. ఈ ప్రకటనపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తన తల అంటే ఆ సన్యాసికి ఎందుకు అంత ఇష్టమో తెలియదని ఉదయనిధి అన్నారు. రూ. పది కోట్లు ఎందుకు, పది రూపాయల దువ్వెన ఇస్తే తానే తన తల దువ్వుకుంటానని చెప్పారు. ఛాప్, స్లిట్ అనే పదాలకు తమిళంలో తల దువ్వుకోవడమనే అర్థం ఉంది. ఈ అర్థాన్ని వాడుకుంటూ సాధువు హెచ్చరికను ఉదయనిధి తేలిగ్గా తీసిపారేశారు. ఇలాంటి బెదిరింపులు తమ కుటుంబానికి కొత్తేంకాదన్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మళ్లీ మళ్లీ అదే చెబుతానని స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ సాధువుకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉదయనిధి ప్రశ్నించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos