అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వైద్యులు మరోమారు కరోనా టెస్ట్ చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్ కు కరోనా రావడంతో ఇప్పటికే ఒకసారి ఆయనకు టెస్టు చేశారు. అందులో కరోనా నెగెటివ్ గా తేలింది. తాజాగా జరిపిన పరీక్షలోనూ అధ్యక్షుడికి కరోనా నెగెటివ్ అనే రిపోర్ట్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీంతో ఇండియా పర్యటనలో ఎలాంటి మార్పులేదని వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాలకు ముందుజాగ్రత్త చర్యగా ప్రెసిడెంట్ బైడెన్ మాస్క్ ధరించి హాజరవుతారని పేర్కొంది. జీ20 సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి ఈ నెల 7న చేరుకోనున్న బైడెన్.. 8న భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇక 9,10 తేదీల్లో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా వియాత్నం వెళతారు. జీ20 సదస్సుకు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా వివిధ దేశాధినేతలు హాజరవుతారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగిస్తారు. మరోవైపు... జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాబోరంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్న పలువురు అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. జిన్ పింగ్ హాజరుపై సందేహాలు నెలకొన్నాయని, ఆయన వస్తున్నట్లుగా ... ఇప్పటివరకు తమకు ఎలాంటి సూచనలు అందలేదని అధికారులు చెప్పారని వార్తలు వెలువడుతున్నాయి. భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జిన్ పింగ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. జిన్ పింగ్ హాజరు కావడం లేదన్న వార్త తనను నిరాశకు గురిచేసిందని బైడెన్ అన్నారు. అయితే, త్వరలోనే జిన్ పింగ్ ను కలుస్తానని ఆయన వివరించారు. ఎక్కడ, ఎప్పుడు కలుస్తారనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. చివరిసారిగా ఈ ఇద్దరు నేతలు బాలిలో నిర్వహించిన జీ20 సదస్సులో కలుసుకున్నారు. ఆ తర్వాత చైనా నిఘా బెలూన్ ఒకటి అమెరికా గగనతలంపై ఎగరడం, యుద్ధ విమానాలను పంపించి అమెరికా దానిని కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు కలుసుకోలేదు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు కలుసుకుంటారని అంతా భావించారు. అయితే, జిన్ పింగ్ హాజరుపై సందేహాలు రేకెత్తడంతో బైడెన్ స్పందిస్తూ జిన్ పింగ్ ను త్వరలోనే కలుస్తానని పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos