ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. దాదాపు రెండేళ్లకు పైగా సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనపై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. శుక్రవారం వెలువడిన ఈ తీర్పులో కోర్టు కేజ్రీవాల్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఉన్న కేసును కూడా కొట్టివేసింది. "ఎక్సైజ్ విధానంలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదు" అని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరటనివ్వడమే కాకుండా, రాజకీయంగా ఆ పార్టీకి కొత్త బలాన్ని ఇచ్చింది.

ఈ కేసు 2023 నుంచి అనేక మలుపులు తిరుగుతూ సాగింది. అక్టోబర్ 2023: లిక్కర్ పాలసీ కేసులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  తొలిసారి సమన్లు జారీ చేసింది. అదే సంవత్సరం నవంబర్ - డిసెంబర్ నెలల్లో కేజ్రీవాల్ వరుసగా మొదటి రెండు సమన్లను దాటవేశారు. ఇవి "రాజకీయ ప్రేరేపితం" అని కొట్టిపారేశారు. 2024 జనవరి - ఫిబ్రవరి నెలల్లో కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ 3వ, 4వ, 5వ, 6వ సమన్లకు కూడా ఆయన హాజరు కాలేదు. ఆ ఏడాది మార్చి 16 న సమన్లను దాటవేసినందుకు దాఖలైన ఫిర్యాదులపై సెషన్స్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

మరోవైపు ఆ ఏడాది మార్చి 21న ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించేందుకు నిరాకరించిన కొద్దిసేపటికే, తొమ్మిది సమన్లు దాటవేసిన అనంతరం ED కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. మే 10న లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోయారు. అదే ఏడాది 2024లో జూన్ 20 - 26 తేదీల మధ్య మనీ లాండరింగ్ కేసులో బెయిల్ లభించినప్పటికీ, హైకోర్టు దానిని నిలిపివేసింది. అనంతరం సీఐఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 13న సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 27, 2026 నాడు ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్, సిసోడియాలకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇస్తూ కేసును ముగించింది.

Related Videos