ఢిల్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఢిల్లీ ప్రచారంలోకి దిగారు. యూపీ సీఎం యోగీ ఢిల్లీలో యూపీ, బీహార్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆప్, కేజ్రీవాల్ లక్ష్యంగా యోగి తన అస్త్రాలను సంధించారు. కేజ్రీవాల్ కు సవాళ్లు విసరడమే కాకుండా... ఆప్ పాలనలో ఢిల్లీ డంపింగ్ యార్డుగా మారిందని, విద్యుత్ నిరంతర సరఫరాలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందని చెప్పిన యోగి .. తాను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే కేజ్రీవాల్ యమున నదిలో స్నానం చేయాలని సవాల్ విసిరారు.
మరోవైపు యోగి ఆరోపణలపైన కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. యూపీలో విద్యుత్ కోతల గురించి ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా గురించి ప్రశ్నిస్తున్న యోగి.. పదేళ్లుగా యూపీలో అధికారం లో ఉన్న యోగి ..ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. దీనికి యోగీ స్పందిం చారు. ఆప్ అసమర్థ పాలనలో విదేశాల నుంచి అక్రమ వలసలు పెరిగాయని విమర్శించారు. బంగ్లా దేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారనే వ్యాఖ్యలతో ప్రచారం కొత్త టర్న్ తీసుకుంది. వారిని అడ్డుకోకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని యోగి విమర్శించారు.
ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని.. ఢిల్లీ రహదారుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని యోగి ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల పైన భారం మోపారని టార్గెట్ చేసారు. అసత్యాలు ప్రచారం చేయటమే ఆప్ నేతల పని అంటూ ధ్వజమెత్తారు. మరో వైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సైతం ఢిల్లీలో ప్రచారం ప్రారంభించారు. ఈ నెలాఖరులో ప్రధాని మోదీ ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. హ్యాట్రిక్ పై ఆప్ గురి పెట్టింది. కాగా, గెలుపు తమదే అంటూ బీజేపీ కొత్త వ్యూహాలతో ఎన్నికల బరిలో ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos