ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా ఖరారు కానున్నా.. ఫిబ్రవరి 20న ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు రామ్‌లీలా మైదానంలో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు, వారి మిత్రపక్షాలు హాజరుకానున్నాయి. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టిన బీజేపీ.. ఈ విజయాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ప్రమాణస్వీకర వేడుకను నిర్వహించాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 20వ తేదీ గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ షో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

మొత్తం 20 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరవుతున్నారు. వీరితో పాటు ముఖ్య దేశాలకు చెందిన దౌత్యవేత్తలను కూడా ఆహ్వానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొననున్నారు. 50 మందికిపైగా సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. వీరితో పాటు బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద, బాబా భగవేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి సహా పలువురు ఆధ్యాత్మికవేత్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ... ఫలితాలు వెలువడి 10 రోజులు గడిచినా సీఎం ఎవరనేది ఇంకా తేల్చలేకపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు చేస్తోన్న కమలనాథులు... సీఎంను ఎన్నుకునేందుకు బుధవారం శాసనసభాపక్షం సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే, పది రోజులు గడిచిపోయిన కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోవడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపే విశ్వసనీయమైన సారథే లేరని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ విమర్శించారు. బీజేపీ నుంచి విజయం సాధించిన 48 మంది ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదని ఆమె ఎద్దేవా చేశారు. వచ్చే అయిదేళ్లలో ఢిల్లీ ప్రజలు ముగ్గురు సీఎంలను చూసే అవకాశం ఉందంటూ ఆప్‌ సీనియర్‌ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos