దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. షెడ్యూల్ వెల్లడించనుంది. కొత్త ఏడాదిలో జరగబోయే మొదటి ఎన్నికలు ఇవే. ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి రెండో వారంతో ముగియనుంది. దీంతో ఈలోగా ఎన్నికల నిర్వహణ పూర్తిచేసి.. కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది.

మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కిందటిసారి 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించి.. అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. మళ్లీ హ్యాట్రిక్ గెలుపుకోసం ఆప్ విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా ఈసారి ఢిల్లీలో కాషాయ జెండా ఎగరాలని కమలనాథులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే ఆప్ 70 స్థానాలకు నాలుగు దశల్లో అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. అటు, బీజేపీ సైతం తొలి జాబితాను ప్రకటించింది.

ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే గత చాలా కాలంగా... ఆప్, బీజేపీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాందీలను ఉద్దేశించి బీజేపీ నేత రమేశ్ బిదూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇరువురి మహిళా నేతలను ఆయన కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాలను ఆప్ ఇప్పటికే ప్రకటించగా... బీజేపీ దశలవారీగా ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఆ పార్టీ ఇటీవలే తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 29 మందితో కూడిన జాబితా వెలువడింది. ఇంకో రెండు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థల వివరాలనూ వెల్లడించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos