జమ్మూ కశ్మీర్లో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన మూడు రోజుల తర్వాత జరిగిన తొలి ఎన్కౌంటర్ ఇదే. ఆ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాలు అప్రమత్తం చేయడంతో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్కు దారితీసింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. మిగతా ముగ్గుర్ని సైన్యం చుట్టుముట్టింది.
తొలుత కుల్గామ్లోనూ.. తర్వాత షోపియాన్లో కాల్పులు మొదలయ్యాయి. దాదాపు మూడు గంటలుగా భీకర కాల్పులు కొనసాగినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో కొనసాగిన ఈ ఎన్కౌంటర్కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రమూకల స్థావరాలను కూల్చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే.. ఆ తర్వాత ఏం చేయాలో భారత్కు తెలుసని పేర్కొన్నారు. భవిష్యత్లో పాకిస్తాన్ ఏం చేస్తుందనేదానిపై ఒక కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు.ఉగ్రవాదం-చర్చలు.. ఉగ్రవాదం వాణిజ్యం ఎప్పుడూ ఒకే దగ్గర ఉండలేవని తేల్చి చెప్పారు. అదే సమయంలో నీళ్లు, రక్తం కలిసి ఒకే దగ్గర ప్రవహించలేవని ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos