ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మధుర వద్ద ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులు, కార్లు నిమిషాల్లోనే దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. అయితే తొలుత నలుగురు మరణించినట్టుగా అధికారులు తెలుపగా... ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు జాతీయ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.

మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 13 మంది కాలిన గాయాలతో మరణించగా, 35 మంది గాయపడ్డారని ఒక పోలీసు అధికారి తెలిపారని ఆ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం తర్వాత తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పలువురు వాహనాల్లో బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. "ఈ ప్రమాదం ఎక్స్‌ప్రెస్‌వేలోని ఆగ్రా-నొయిడా లేన్‌లో మైలురాయి 127 వద్ద జరిగింది. మూడు కార్లు ఢీకొన్నాయి, ఆ తర్వాత ఏడు బస్సులు వాటిని ఢీకొన్నాయి. వాటిలో ఒకటి రోడ్‌వేస్ బస్సు కాగా, మిగిలిన ఆరు స్లీపర్ బస్సులు... 11 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. అన్ని బస్సుల్లో మంటలు చెలరేగాయి, ఇప్పుడు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని...''  మధుర రూరల్ ఎస్పీ సురేష్ చంద్ర రావత్ జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. మధుర ఎస్ఎస్‌పీ శ్లోక్ కుమార్ మాట్లాడుతూ... ఈ ప్రమాదానికి కారణం విజిబులిటీ తక్కువ ఉండటమేనని అన్నారు. ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ... '' దాదాపు 3 నుంచి 4 బస్సులు అగ్నిప్రమాదానికి గురయ్యాయి... ప్రమాదం జరిగినప్పుడు నేను నిద్రపోతున్నాను. బస్సు పూర్తిగా ప్రయాణికులతో నిండి ఉంది. అన్ని సీట్లు నిండి ఉన్నాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిందని'' తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos