ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. మరోసారి జాతుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతవారం జిరిబామ్‌ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా ఆరుగుర్ని అపహరించి.. అత్యంత పాశవికంగా హత్య చేశారు. వీరి శవాలు నదిలో గుర్తించారు. అయితే, దీని వెనుక కుకీ మిలిటెంట్ల హస్తం ఉన్నట్టు అనుమానించడంతో రాష్ట్రంలో అల్లర్లు రాజుకున్నాయి.

హత్యాకాండకు నిరసనగా మైతీలు ఆందోళనలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడిచేసి, నిప్పంటించారు. సీఎం బీరేన్ సింగ్ నివాసానికీ నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులు బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మిత్రపక్షం ఎన్పీపీ సైతం మద్దతు ఉపసంహరించింది.

ఈ క్రమంలో మణిపూర్‌ పరిణామాలపై చర్చించడానికి సీఎం బీరేన్‌ సింగ్‌ మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై సమీక్షించిన ఈ భేటికి 11 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే డుమ్మాకొట్టారు. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని, జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా వారం రోజుల్లోగా భారీ ఆపరేషన్ చేయాలని తీర్మానించారు. అయితే, ఈ హత్య కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు.. జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ తీవ్రవాదులను చట్టవిరుద్ధమైన సంస్థ’ సభ్యులుగా ప్రకటించేందుకు అంగీకరించారు.

మరోవైపు, మణిపూర్‌లో పరిస్థితులపై కేంద్రం అప్రమత్తమయ్యింది.ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హింసను అదుపుచేసి, శాంతి నెలకొనేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది మే నుంచి మైతీ, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న హింసాకాండలో ఇప్పటి వరకు 220 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos