కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఎస్ఎం కృష్ణ పూర్తి పేరు సోమణహళ్లి మల్లయ్య కృష్ణ. 1932 మే 1వ తేదీన మండ్య జిల్లాలోని సోమణహళ్లిలో జన్మించారు. మైసూరు మహారాజా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలోనూ చదువుకున్నారు. 1960లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎస్ఎం కృష్ణ 1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1968 నాటి లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి గెలిచారు. క్రమంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. దీన్ని గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణిస్తుంటారు కన్నడిగులు. బెంగళూరు స్వరూపం సమూలంగా మారింది ఈ కాలంలోనే. సిలికాన్ సిటీగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆయన హయాంలోనే బెంగళూరు- ఐటీ హబ్‌గా, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కేంద్రబిందువుగా రూపాంతంరం చెందింది. నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు ఆయన హయాంలోనే నిర్మితం అయ్యాయి. రోడ్లు విస్తరణకు నోచుకున్నాయి. ఫలితంగా కనెక్టివిటీ పెరిగింది. సాఫ్ట్‌వేర్ సంస్థలను నెలకొల్పే వారికి ప్రభుత్వాలు అనేక రాయితీలను ఇవ్వడం మొదలైంది కూడా ఆయన హయాంలోనే.
ఎస్ఎం కృష్ణ మృతి పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధితనే మల్లికార్జున్ ఖర్గే, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. బెంగళూరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం ఆయన స్వగ్రామం- మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా పరిధిలో గల సోమణహళ్లిలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos