మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దేశం ఒక విశిష్ట నాయకుడిని కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్ నిరాడంబర మూలాల నుంచి వచ్చినప్పటికీ.. క్రమంగా ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రిగా సేవలు అందించక ముందు వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారు. మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మన్మోహన్ సింగ్ విస్తృతంగా కృషి చేశారని మోదీ ప్రశంసించారు.
మరోవైపు మన్మోహన్ సింగ్ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ... మన్మోహన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయిందని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఒక సందేశంలో పేర్కొన్నారు. ఆర్థిక వేత్తగా, అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దివంగత నేత ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాయనని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. మన్మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ గారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్టు పవన్ ప్రకటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos