కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న క్రమంలో.. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

సురేష్ కల్మాడి స్వరాష్ట్రం.. మహారాష్ట్రలోని పుణే. మూడుసార్లు పూణే నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1996, 2004, 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. రైల్వే సహాయ మంత్రిగా చిరస్మరణీయ సేవలను అందించారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాజకీయ, క్రీడా రంగాలలో కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ లో సుదీర్ఘకాలం పాటు సేవలను అందించారు. సురేష్ కల్మాడి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి పుణెలోని ఆయన నివాసానికి తరలించారు. పార్టీ నాయకులు, ఆయన అభిమానుల సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉంచుతారు. అనంతరం నవీపేట్‌లోని వైకుంఠ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

భారత వాయుసేనలో పైలట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సురేశ్ కల్మాడీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఒక దశలో పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయనకు పేరుండేది. రాజకీయాలతో పాటు క్రీడారంగంలోనూ కల్మాడీ కీలక పాత్ర పోషించారు. భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, ఆ తర్వాత కొన్ని వివాదాలు ఆయన రాజకీయ జీవితంపై ప్రభావం చూపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. సురేష్ కల్మాడీ మరణం పట్ల సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos