తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. కాగా, సోమవారం రంగారెడ్డి జిల్లాలో 9 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 7 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో 5 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లాలో 5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లాలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టులో దాదాపు వేసవిని తలపించేలా వాతావరణం ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ మొదటివారం నుంచి కురిసిన వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తరచుగా కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని వ్యాపారాలపై నీలినీడలు కమ్ముకున్నాయని, నష్టాలు కాకపోయినా వ్యాపారం తగ్గుతోందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో గత రెండు నెలలుగా వినియోగదారులు మార్కెట్లకు దూరంగా ఉంటున్నారు. నెలల తరబడి మంచి వ్యాపారం జరగలేదనీ, ఖర్చులు భరించడం కష్టంగా మారిందని వ్యాపారులు అంటున్నారు. వీధుల్లో చిన్న వస్తువులను విక్రయించి జీవనోపాధి పొందే స్థానిక వ్యాపారులు లేదా సీజన్ కు సంబంధించి వ్యాపారాలు నిర్వహించే వారు కూడా వర్షాల కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos