గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ముందుగా ఊహించిన దాని కంటే వేగంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ నైరుతి రుతుపవనాలు.. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో గత 2 రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
అయితే రానున్న 3, 4 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు మొత్తం విస్తరించనున్నట్లు ఐఎండీ ప్రకటన వెలువరించింది. దీంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఈ నైరుతి రుతుపవనాలు వ్యాపించే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. ఇక ఐఎండీ ఇప్పటికే అంచనా వేసినట్లుగా ఈ నెల 27వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన భారతదేశంలోకి అడుగుపెడతాయి. అప్పుడే తొలకరి జల్లులు పలకరిస్తాయి. మన దేశంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాయి. అయితే ఈసారి అంతకు ముందే ఈ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సూచనలు కనిపిస్తున్నాయని ఇటీవల ఐఎండీ వెల్లడించింది. ఒకవేళ ఇదే నిజమైతే.. 2009 తర్వాత అంచనాల కంటే ముందుగా నైరుతి రుతుపవనాలు రావడం ఇదే మొదటిసారి అవుతుందని పేర్కొంది. 2009లో మే 23వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. మరోవైపు.. ఈ ఏడాదిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ.. రైతులకు శుభవార్తను చెప్పింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos