ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌకగా పేరొందిన 77 ఏళ్ల గద్దర్ ఇకలేరు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన గద్దర్.. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన మాటనే పాటగా మలిచి... కోట్లాది మందిని కదిలించిన విప్లవకారుడు ఇకలేరనే విషయం చాలామందిని ఆవేదనకు గురిచేస్తోంది. ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్... అనారోగ్యం నుంచి కోలుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా పరిస్థితి విషమించి ఆసుప్రతిలోనే మృతిచెందారు. గద్దర్ 12 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారని ... ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనూ గద్దర్ పాటలు పాడారని ఆయన బంధుమిత్రులు తెలిపారు. కాగా... గద్దర్ మరణ వార్త తెలియగానే పెద్దసంఖ్యలో అభిమానులు, ఉద్యమ, ప్రజాసంఘాల నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని జోహార్లు అర్పించారు. గద్దర్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ మృతి చాలా బాధాకరమని ... ఆయన మరణం తీరని లోటని... ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ నివాళులు అర్పించారు. ప్రముఖ సినీనటులు చిరంజీవి, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఉన్న గద్దర్ పార్థివదేహానికి జనసేనాని కళ్యాణ్ నివాళుర్పించారు. గద్దర్ కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇదిలావుండగా.. దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా... గద్దర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై యాంటీ టెర్రరిజం ఫోరం భగ్గుమంటోంది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్న ఎంతోమంది పోలీసులు, పౌరులు అమరులయ్యారని... ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈవిధంగా ప్రకటన చేయడమంటే... వారిని అవమానపర్చడమేనని ఫోరం విమర్శిస్తోంది. గద్దర్ తను రాసిన, ఆలపించిన విప్లవ గీతాల ద్వారా యువతలో ఆగ్రహావేశాలను రెచ్చగొట్టి నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన విషయం ప్రభుత్వానికి తెలియదా... ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలి తీసుకున్న విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా అని ఫోరం ప్రశ్నిస్తోంది. నక్సలిజం పేరిట ... విప్లవవాదులు సాధారణ పౌరులతో పాటు జాతీయవాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలి తీసుకున్న విషయం ప్రభుత్వం మరిచిందా అని నిలదీస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను ప్రేరేపించిన గద్దర్ లాంటి వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని ఆ ఫోరం నాయకులు పేర్కొన్నారు. ఫోరం స్పందనపై ప్రజల్లో మిక్స్ డు రెస్పాన్స్ రావడం గమనార్హమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos