పశ్చిమాసియా తీరాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. క్షిపణుల మోతతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ కకావికలమైంది. సముద్ర మార్గాల్లో చమురు నౌకలు నిలిచిపోయాయి. ఆ సెగ మెల్లగా ప్రవహిస్తూ, ఖండాలు దాటి.. మధ్యతరగతి వారి పెళ్లి సందడులు వాకిట్లోకి వచ్చి మధ్యలో ఆగిపోతున్నాయి. అక్కడ యుద్ధం మొదలైతే, ఇక్కడ వంటల పొయ్యి ఆరిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నెల 18 నుంచి మొదలుకానున్న పెళ్లిళ్ల సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబాలు, అతిథులకు భోజనాలు ఎలా పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నాయి. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు దాదాపుగా నిలిచిపోయాయి. గ్యాస్ అందుబాటులో లేక నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీని ప్రభావం నేరుగా క్యాటరింగ్ రంగంపై పడింది. భారీ ఆర్డర్లు తీసుకున్న నిర్వాహకులు, గ్యాస్ లేకుండా వంటలు చేయడం సాధ్యం కాదని చేతులెత్తేస్తున్నారు. తీసుకున్న అడ్వాన్సులను సైతం తిరిగి ఇచ్చేస్తున్నారు. మార్చి 18 నుంచి మే వరకు పెళ్లిళ్లకు అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 15 వేల వివాహాలు జరగవచ్చని ఒక అంచనా. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు జూన్ వరకు బుక్ అయిపోయాయి. అయితే, గ్యాస్ కొరతతో ఇప్పుడు పెళ్లిళ్లు జరపాలా లేక వాయిదా వేసుకోవాలా అని చాలా కుటుంబాలు పునరాలోచనలో పడ్డాయి.

మరోవైపు తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్ట్ తమ ఫ్రెండ్ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరో వారం రోజుల్లో ముహూర్తం.. పట్టు బట్టలు, ఆహ్వాన పత్రికలు, బంధువుల సందడితో ఆ ఇల్లు కళకళలాడుతోంది. పెళ్లికొడుకు మొహంలో చిరునవ్వు.. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. సరిగ్గా అదే సమయంలో క్యాటరింగ్ మేనేజర్ నుండి ఒక ఫోన్ కాల్‌! ఆ గొంతులో వణుకు, మాటల్లో ఆందోళన. "సార్.. పశ్చిమాసియా గొడవల వల్ల గ్యాస్ సప్లై పూర్తిగా కట్ అయిపోయింది. ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. మీరే సిలిండర్లు అరేంజ్ చేయకపోతే.. వేల మందికి వంటలు వండటం మా వల్ల కాదు!" ఆ మాట వినగానే వరుడి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. వరుసగా పెళ్లి ముహూర్తాల సీజన్ ఇది. ఏ క్యాటరర్‌ని అడిగినా అదే సమాధానం.. "సిలిండర్లు లేవు!" అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో, ఇక్కడ సామాన్యుల పెళ్లిళ్ల వంటలు ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి.  ఈ సంక్షోభం.. పెళ్లిళ్ల సీజన్‌ను నమ్ముకుని జీవించే వేలాది మంది ఉపాధిని దెబ్బతీస్తోంది. క్యాటరింగ్ సిబ్బందితో పాటు పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, డెకరేటర్లు, బ్యాండ్ మేళం వంటి ఎన్నో అనుబంధ రంగాల వారికి పని లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని, యుద్ధం ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos