తెలంగాణలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. అనర్హత  కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ... నాలుగు వారాలకు కేసు వాయిదా వేసింది.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు... తనతో పాటు, తన సతీమణికి చెందిన కొన్ని ఆస్తులను వెల్లడించకుండా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయనపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
2018 ఎన్నికల్లో వనమాపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి 4,139 ఓట్ల తేడాతో ఓడిపోయి రెండోస్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అంతేకాదు... వనమా అయిదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించింది కూడా. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పును నిలిపి వేసింది.  హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే జలగం వెంకట్రావు తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని.. ప్రమాణస్వీకారం చేయించాలని అధికారులను, బీఆర్ఎస్ పెద్దలను కలిశారు.  
కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన 84 పేజీల తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందజేశారు. స్పీకర్‌కు ఫోన్‌లో విషయం చెప్పారు. అయితే ఆయనను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి  వనమా వెంకటేశ్వరరావు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. వనమా పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం  హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు ఇద్దరూ బీఆర్ఎస్‌కు చెందిన వారే కావడంతో ఈ  అంశంపై నిర్ణయం తీసుకోవడంలో  బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది.  వనమా  వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున గెలిచినప్పటికీ  ... ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి అక్కడ జలగం వెంకట్రావుకు ప్రాధాన్యత తగ్గడంతో ... ఆయన అసంతృప్తితో ఉన్నారు. కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. కానీ ఈ తీర్పు వచ్చిన తర్వాత తాను పార్టీకి విధేయుడినేనని చెబుతూ వస్తున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసి ఉన్నట్లయితే.. వనమా మాజీ అయ్యేవారు. జలగం వెంకట్రావు మూడురోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవారు. అయితే వివాదం కారణంగా ఇద్దరూ హాజరు కాలేదు.   
ఇంతా చేసి ఎమ్మెల్యే పదవి కాలం మూడు నెలలే ఉంది.  వనమా కేసు విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది. అప్పటికి తెలంగాణలో ఎన్నికలు బాగా సమీపించే అవకాశం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లు కోర్టుల్లో ఉన్నాయి. ఈ కేసుల తీర్పు వచ్చేసరికి వారి టర్మ్ కూడా అయిపోయేలా ఉంది.  నాలుగువారాల తరువాత సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందోమరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos