చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపుర్ జిల్లాలోని అబూజ్ మడ్‌లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడం వల్ల భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో 28 మంది మవోయిస్టులు మరణించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు చత్తీస్​గఢ్ హోంమంత్రి విజయ్ వర్మ తెలిపారు.

ఉదయం నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగు తోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాధ్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్‌ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబాల కేశవరావు పనిచేశారు.

నంబాల కేశవరావు వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్‌ చదివారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్‌ చదువుతూ పీపుల్స్‌ వార్‌ సిద్ధాంతల పట్ల నంబాల కేశవరావు ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. 1987లో బస్తర్‌ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. 2018 నవంబర్‌లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరాలు సూత్రధారిగా ఉన్నారు. చంద్రబాబు పై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి.. అలాగే.. తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని చెబుతున్నారు.

Related Videos