భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ - సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల చట్టాలు, నియమాలు అందులో జారీ చేసిన సూచనల ప్రకారం, భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందని జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

సీఈసీ గా జ్ఞానేశ్‌ కుమార్‌ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసింది. నూతన సీఈసీ నియామకంపై రాష్ట్రపతి ద్రౌపదిముర్ము  17వ తేదీ రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో 26వ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ పదవీ కాలం 2029 జనవరి 26 వరకు ఉండనుంది. అలాగే ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్‌ స్థానంలో హరియాణా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ వివేక్‌ జోషి నియమితులయ్యారు.

జ్ఞానేష్ కుమార్ నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో 20 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతాయి. ఆయన పదవీ కాలంలో ఎన్నికలు బీహార్ నుంచి ప్రారంభం కానుండగా.. చివరి ఎన్నికలు మిజోరాంలో జరుగుతాయి. జ్ఞానేష్ కుమార్ ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, 2026లో కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. అదే విధంగా 2026లో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన పర్యవేక్షిస్తారు.

1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ జనవరి 27, 1964న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించారు. ఆయన ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ICFAI నుండి బిజినెస్ ఫైనాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పర్యావరణ ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందారు. ఆయన ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్‌గా, అడూర్ డిప్యూటీ కలెక్టర్‌గా, కేరళ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, కేరళలోని కొచ్చిన్ మునిసిపల్ కార్పొరేషన్ మునిసిపల్ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన అనేక ఇతర పదవులలో కూడా పనిచేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో తన పదవీ కాలంలో జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిర్ణయాలను అమలు చేయడంలో జ్ఞానేష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos