-కొండూరి వీరయ్య, న్యాయవాది, హైదరాబాద్..  ఏచూరితో నా ఇరవయ్యేళ్ల అనుబంధంలో కొన్ని జ్ఞాపకాలు.. కమ్యూనిస్టు పోరాట యోధుడు, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి మన మధ్య లేరు. కానీ ఆయనతో గడిపిన సమయం, జరిపిన చర్చలు, ఆయన నేర్పిన పాఠాలు, అందించిన గుణపాఠాలు, చేసిన త్యాగాలు, మిగిల్చిన జ్ఞాపకాలే మనతో ఉన్నాయి. దేశ రాజకీయ యవనికలో అవసరమైన మార్పులు జరుగుతున్న తరుణంలో ఆ మార్పులను ఓ దారిలో గాడిలో పెట్టగలిగిన సామర్ధ్యం ఉన్న ఏకైక నాయకుడు ఏచూరి. ఆయనది అకాల మరణం. మనల్ని వీడి వెళ్లిపోవడానికి ఆయన కూడా సిద్ధంగా లేలేని తరుణం. అందుకే దాదాపు మూడు వారాలు మృత్యువుతో పోరాడారు. చివరి నిమిషం వరకూ మృత్వువుపై పై చేయి సాధించటానికి ప్రయత్నించారు.నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట నిర్ధారణ, ఆ నిర్ధారణకు అనుగుణంగా నిర్దిష్ట నిర్ణయం చేయాలన్నది మౌలిక గతితార్కిక మార్క్సిస్టు సూత్రం. దేశ విదేశాల పరిణామాలను పామరులకు సైతం అర్థం చేయించటంలో ఈ సూత్రాన్ని పాటించిన సీతారాం తన ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ సూత్రాన్ని పాటించలేకపోయారు. ఆయనకు రేయింబవళ్లు శ్రమించి చికిత్స అందించిన వైద్యుల మాటల్లో ఆయన ఆర్నెల్ల క్రితమే ఆసుపత్రికి వచ్చి ఉండాల్సింది. సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లలేకపోవటం చివరకు ప్రాణాంతకంగా మారింది. దాదాపు పదేళ్లు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా , పదికిపైగా ఆయన పుస్తకాలను కూర్చినవాడిగా, ఆయనతో ఉన్న ఇరవయ్యేళ్ల అనుబంధంతో కొన్ని జ్ఞాపకాలు మీ దృష్టికి తేవడానికి చేసిన ప్రయత్నమే ఈ వ్యాసం.

ఆయనతో నా పరిచయం 1998లో మొదలైంది. అప్పట్లో గుంటూరు జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి గా నూతలపాటి కాళిదాసు ఉండేవారు. విజయవాడ లో సాంస్కృతిక రంగంలో కమ్యూనిస్టుల పని విధానం గురించిన శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అందులో నన్ను కూడా ఓ విద్యార్థిగా ఎంపిక చేయటంలో కాళిదాసు పాత్ర ఉంది. ఆ విధంగా తొలిసారి ముఖా ముఖి కలసాను సీతారాం ను. తర్వాత ఢిల్లీ ప్రజాశక్తి విలేకరిగా పని చేసే క్రమంలో ఆయనతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. 2002 లో గుజరాత్ నరమేధం లో చిటికిన బతుకులను పరామర్శించడానికి పర్యటించిన సీపీఎం బృందానికి ఆయన నాయకుడు. అప్పటికే ప్రజాశక్తి విలేకరిగా ఆ నరమేధం ప్రభావిత ప్రాంతాల్లో నేను కథనాల సేకరణకు వెళ్ళాను. అక్కడ ఆయా కుంటునాలను ఆయన పరామర్శించిన తీరు వారికి ఓదార్పు తో పాటు ధైర్యాన్ని చెప్పిన తీరు చూస్తే మానవతా కోణంతో పని చేసే ఓ నైపుణ్యం కలిగిన స్వచ్చంద సంస్థ నాయకుడు కనిపిస్తాడు. ఆ పర్యటన తర్వాత తిరిగి వచ్చాక గురజాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నరమేధం ప్రభావంతో ఏమైనా మార్పులు వస్తాయా అని అడిగితే ప్రజాస్వామ్యానికి డబుల్ డామేజీ జరుగుతుందని మరింత భయంతో ముస్లింలు తమ స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని వదులుకుంటారనీ విశ్లేషించారు. ఆయన అంచనా రుజువు అయ్యింది. రెట్టించిన బలంతో మోడీ తిరిగి అధికారానికి వచ్చారు.

అప్పట్లో ఆయన రాజ్యసభ సభ్యులు. నేను ఆయనకు ప్రైవేటు కార్యదర్శిని. ఒకరోజు పార్లమెంట్ కారిదార్లో ఇద్దరమూ వెళ్తున్నాము. ప్రతిపక్ష నేత కార్యాలయం నుండి అద్వానీ ఆయనతో పాటు హర్యానా కు చెందిన బిజెపి నాయకులూ వస్తున్నారు. ఇద్దరూ దగ్గరకు వచ్చాక అద్వానీ చేయి చాచి 'నువ్వు పార్లమెంట్కు ఆలస్యంగా వచ్చావు' అన్నారు నవ్వుతూ... ఏచూరి గడియారం వంక చూసుకుని 'లేదే... టైం కే వచ్చా కదా' అన్నారు. దానికి సమాధానంగా అద్వానీ 'ఈ వయస్సు లో కాదు. ఇంకా పదేళ్ల ముందే నువ్వు పార్లమెంట్కు వచ్చి ఉండాల్సింది పార్లమెంట్లో చర్చల నాణ్యత మరింతగా పెరిగేది. నువ్వు చేసే ప్రతి ఉపన్యాసమూ పూర్తిగా వింటాను' అన్నారు. సైద్ధాంతికంగా పూర్తి విరుద్ధమైన శిబిరానికి చెందిన వారు కూడా సీతారాం ని అభిమానించేలా వ్యవహరించటం సీతారాం విషిష్టత.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకనాడు పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్రను తొలిసారి హిందీలో యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఏచూరితో పాటు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, బిజెపి అగ్రనేతల్లో ఒకరుగా ఉన్న వెంకయ్యనాయుడులను పిలిచాము. ఆ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ 'పేరుకేమో సీతారాం. ఆయనేమో అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారు. ఇదెక్కడి గొడవో తెలీదు. అయినా తాను ఎన్నుకున్న మార్గంలో ఎన్నుకున్న పద్ధతుల్లో ఆయన కూడా సమాజ మార్పు కోసం పని చేస్తున్నారు. అందుకే ఆయన్ను మా సైద్ధాంతిక విభేదాలు మర్చి గౌరవిస్తాము' అన్నారు. శివశంకర్ మీనన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న రోజులవి. ఓవైపు బ్రిక్స్ (భారత్, చైనా, బ్రెజిల్, రష్యా కూటమి) గురించి ప్రాధమిక అవగాహన చర్చలు జరుగుతున్న రోజులు. ఆ సందర్భంలోనే వర్ధమాన దేశాలు జాతీయ ఆర్థిక వ్యవస్థలను బాగు చేసుకోవటం కోసం ప్రపంచబ్యాంకు వంటి వడ్డీవ్యాపారులను ఆశ్రయించకుండా మరేదైనా ప్రత్యామ్నాయం చూడాలని ఏచూరి శివశంకర్ మీనన్ ముందు ప్రతిపాదన పెట్టారు. ఆ తర్వాత బహుశా రెండేళ్లకే ప్రపంచమంతా సబ్ ప్రైమ్ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్లమెంట్లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం డికప్లింగ్ సిద్ధాంతం ప్రతిపాదించారు. అంటే సబ్ ప్రైమ్ సంక్షోభం ప్రభావం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశంపైనే పరిమితంగా ఉంది. దానికి కారణం భారతదేశ ద్రవ్య విధానం అంతర్జాతీయ ద్రవ్య విధానంతో మరీ అంతగా పెనవేసుకోలేదు కాబట్టి మనం సంక్షోభం ప్రభావం నుండి తేలిగ్గానే బయట పడ్డామన్నది చిదంబరం వాదన. దానికి స్పందనగా పార్లమెంట్లో సీతారాం ఏచూరి 'ప్రపంచీకరణ పేరుతో గుండుగుత్తగా ద్రవ్య పెట్టుబడి రూపొందించే అన్ని విధానాలూ నెత్తికెత్తుకోవాల్సిన అవసరం లేదని, చైనా నుండి నేర్చుకోవాలనీ వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఎం హెచ్చరిస్తోంది అందుకే కదా...' అన్నారు నవ్వుతూ. ఇటువంటి ఎన్నో విషయాల్లో సందర్భోచితంగా జోక్యం చేసుకుంటూ అటు పార్టీ వైఖరికి తన విద్వత్తును జోడిరచి పార్లమెంట్లో రాటు దేలిన ఉపన్యాసకునిగా వెలిగారు ఏచూరి.

వామపక్ష రాజకీయ దురంధరుడు సీతారాం.

భారతదేశంలో వామపక్ష రాజకీయలకు ప్రాసంగికత ఉందా అన్న అంశంపై స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో అద్భుతమైన ప్రసంగం చేసి ఆ సమావేశానికి హాజరైన మేధావులు భారతదేశం భారతదేశంగా మిగలాలంటే బలమైన వామపక్ష ఉద్యమం అవసరం అని అంగీకరించేలా ప్రభావితం చేసిన మేధావి సీతారాం. సంకీర్ణ రాజకీయాల లోతుపాతులు అవగాహన లేని తరం నాయకత్వంలోకి వస్తున్న తరుణం ఇది. సంకీర్ణ రాజకీయాలు మౌలికలక్ష్యాన్ని సాధించే క్రమంలో మజిలీలే తప్ప అంతిమ మజిలీ కాదన్న మౌలిక సూత్రాన్ని గుర్తించి తదనగుణంగా ఎక్కడ మజిలీ అవసరమో అక్కడ ఆగితేనే మరో ప్రయాణానికి గట్టిపునాదులు పడతాయి. అటువంటిదే 1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నికైన ప్రభుత్వాలకు దూరమైన జమ్ము కాశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ క్రమానికి ఊపిరిలూదింది యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం. చివరకు ఈ ప్రజాస్వామిక ప్రస్థానాన్ని బిజెపి కూడా ఎక్కువకాలం అడ్డుకోలేకపోయింది. సూర్జిత్తో కలిసి ఈ వ్యూహాన్ని తెరమీదకు తేవటంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ దురంధరుడు సీతారాం.

ఎన్నేళ్లు ఎన్న నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని క్షణాలు జీవించామన్నది కాదు ముఖ్యం. మనం బతికి ప్రతి క్షణంలోనూ ఎంత జీవితం ఉన్నదన్నది ముఖ్యం అని పదేపదే గుర్తు చేసే సీతారాం 72 ఏళ్లల్లో ప్రతి క్షణంలోనూ జీవితాన్ని నింపిన మానవత నిండిన మార్క్సిస్టు సీతారాం.

- కొండూరి వీరయ్య, న్యాయవాది, హైదరాబాద్

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos