తెలంగాణలో వర్షబీభత్సం మరికొన్ని రోజులు కొనసాగనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 3 వరకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రిభువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా... గురువారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షాల్లోనే గణేశుడి నిమజ్జనాలు కొనసాగాయి. అలాగే సరూర్‌నగర్ మినీ ట్యాంక్బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్మెట్, అడ్డగుట్ట, మారేడ్పల్లి, సీతాఫల్మండి, బోయిన్పల్లి, ప్రకాశ్నగర్, రాణిగంజ్, ప్యారడైజ్.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్పైన కూడా వర్షంలో సామూహిక వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగింది.
మరోవైపు ఏపీలో కూడా... వచ్చే 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకొని దక్షిణ రాయలసీమ జిల్లాల వరకు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos