తెలుగురాష్ట్రాల్లో  వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణలో మరో ఐదు రోజులు, ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక.. హైదరాబాద్ నగరంలో కూడా వర్ష బీభత్సం  కొనసాగుతూ ఉంది. కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెం.మీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలో 15 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. నిజామాబాద్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలో 10 సెం.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  కాగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. నిజాంసాగర్ జలకళను సంతరించుకుంది. 36,500 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తేశారు. శ్రీరాంసాగర్‌కు కూడా వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉండటంతో పదహారు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇక కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఐఎమ్‌డీ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వాన బీభత్సం సృష్టించింది. నామనంక పల్లి దగ్గర వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos