కర్ణాటకకు చెందిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష శాసన సభ్యుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. సంచలన సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏడు సంవత్సరాల కారాగార శిక్ష పడిన ఆయనకు బెయిల్ లభించింది. ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాల వ్యవహారంలో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్ధన్ రెడ్డికి ఏడు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసును ఎదుర్కొన్న తెలంగాణకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీకి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మీని నిర్దోషులుగా తేల్చింది.

వారిపై సీబీఐ నమోదు చేసిన కేసులను కోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో గాలి జనార్ధన్ రెడ్డి దోషిగా తేలారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఆయనతో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ బీవీ శ్రీనివాసరెడ్డికీ ఏడు సంవత్సరాల కారాగార శిక్ష పడింది. దీనిపై గాలి జనార్ధన్ రెడ్డి.. బెయిల్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించి... తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఎటువంటి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లిపోకూడదని హైకోర్టు ఆదేశించింది. పాస్ పోర్టును సరెండర్ చేయాలని సూచించింది. అలాగే 10 లక్షల రూపాయల విలువ గల ష్యూరిటీని అందజేయాలని గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల వ్యవహారం ఆయనకు రాజకీయంగా కూడా చిక్కులను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. క్రియాశీలక రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటు వేసింది.

గాలి జనార్ధన్ రెడ్డి.. కొప్పళ జిల్లాలోని గంగావతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష తరఫున పోటీ చేశారు. దాదాపు 8,000 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన ఇక్బాల్ అన్సారీని ఓడించారు. 2022లో కేఆర్పీపీ పార్టీని స్థాపించారు గాలి. ఆ తరువాత దీన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. మైనింగ్ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించడానికి ముందు ఆయన యడియూరప్ప ప్రభుత్వంలో కర్ణాటక పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2015 నుండి బెయిల్‌పై ఉన్న ఆయన బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. సొంత పార్టీని నెలకొల్పారు

మైనింగ్ అక్రమ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో- రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 (1) (ఈ), 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై ఆరు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేసినట్లు నోటిఫికేషన్‌ పేర్కొంది. ఫలితంగా- గంగావతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.

Related Videos