బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ఫలితాల అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన, తమ పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేకపోయిందని అంగీకరించారు. ఈ వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగా ఈ నెల 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒకరోజు మౌనదీక్ష చేయనున్నట్లు తెలిపారు.

"బీహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త పాత్ర పోషించాం. కానీ ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మా ఆలోచనల్లోనే ఎక్కడో లోపం ఉండి ఉంటుంది. వంద శాతం బాధ్యత నాదే. చాలా నిజాయతీగా ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. ఈ నిజాన్ని అంగీకరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు" అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. గత మూడేళ్లుగా తన శక్తినంతా ధారపోసి పనిచేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీకే స్పష్టం చేశారు. బీహార్‌ను బాగు చేయాలనే తన సంకల్పం నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. "నేను తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఎలాంటి నేరం చేయలేదు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టలేదు. హిందూ-ముస్లిం రాజకీయాలు చేయలేదు. డబ్బులిచ్చి ఓట్లు కొనే నేరానికి పాల్పడలేదని"  వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్.. ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడమే కాకుండా, అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఇరువురు నేతలు ఈ నెల 20వ తేదీన పాట్నాకు వెళ్లనున్నారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్రంలో పర్యటించి, పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా, తన పర్యటనలో భాగంగా పలువురు బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వచ్చిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 20వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో వారు పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos