దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైందన్న అంశం తెలిసిందే.  అయితే, ఒక భారత కంపెనీ భారత్‌లోని అధికారులకు లంచం ఇచ్చిందన్న ఆరోపణలకు అమెరికాలో కేసు ఎలా దాఖలైందనేది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. ఇండియాలో లంచమిస్తే అమెరికాలో కేసు ఎందుకు నమోదు చేశారన్న అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

అదానీ గ్రూప్ సంస్థల్లో అవకతవకలు జరిగాయంటూ ఏడాది క్రితం అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు  ప్రకంపణలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఇప్పుడు మరోసారి అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వచ్చాయి. లంచం ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైంది. దీంతో అదానీ కంపెనీల షేర్లు మళ్లీ కుప్పకూలాయి. ఒక్కరోజే రూ.2 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.

అయితే, ఒక భారత కంపెనీ భారత్‌లోని అధికారులకు లంచం ఇచ్చిందన్న ఆరోపణలకు అమెరికాలో కేసు ఎలా దాఖలైంది... అసలు ఈ లంచాలకు అమెరికాకు ఏమిటి సంబంధం... భారతీయుడైన అదానీ ఇండియాలో సోలార్ ప్రాజెక్టు కోసం ఇక్కడి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇస్తే అమెరికాలో కేసు ఎందుకు నమోదు చేశారనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భాగస్వాములుగా ఉన్న కంపెనీలు, ఒప్పందాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణల ప్రకారం.. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ...  మారిషస్‌కు చెందిన అజూరే పవర్ కంపెనీ సెకీతో ఒప్పందం చేసుకుంది. మరోవైపు.. అజూరే పవర్ కంపెనీ 2023 వరకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదిత కంపెనీగా ఉంది. సెకీ నుంచి సోలార్ పవర్ కొనుగోలు చేసేందుకు దేశంలోని ఏ రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ ముందుకు రాలేదు. అలా రాకుండా అదానీ లంచాలు ఇచ్చారనేది వాదన. మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డిస్కమ్‌లకు ఆయన లంచాలు ఇచ్చి ఒప్పించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో అమెరికాలోని బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. ఈ నిధుల నుంచే లంచాలు ఇచ్చారనేది ఆరోపణ.

అమెరికా ఇన్వెస్టర్లు లేదా మార్కెట్లతో సంబంధం ఉన్న పక్షంలో విదేశాల్లోని అవినీతి వ్యవహారాలనూ పరిశీలించేందుకు అమెరికా చట్టాలు అనుతిస్తాయి. అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలు ఆ దేశంలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం ఏ దేశంలో లంచం ఇచ్చినా నేరమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే 2022లోనే అమెరికా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

2020 నుంచి 2024 మధ్య అదానీ గ్రూప్ కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, యూఎస్ ఏఎంసీల నుంచి 2 బిలియన్ డాలర్లకుపైగా నిధులు సమీకరించాయని గుర్తించింది. అలాగే అమెరికాలో పెట్టుబడిదారులకు, సంస్థలకు సెక్యూరిటీల విక్రయం ద్వారా 1 బిలియన్ డాలర్లు సేకరించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతోనే భారత్‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చి మోసం చేశారని  ఆరోపణలు వచ్చాయి. 

అందుకే అదానీ గ్రీన్ ఎనర్జీ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టైన అజూరే కంపెనీ అమెరికా చట్టాల పరిధిలోకి వచ్చాయి. అందుకే వారిపై కేసు నమోదైంది. అదానీ లంచాల ఆరోపణలపై న్యూయార్క్ ప్రాసిక్యూటర్లతో పాటుగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) సైతం మరో సివిల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

 అమెరికాలోని చట్టాల ప్రకారం విదేశాల్లోనూ లంచాలు ఇచ్చి వ్యాపారాలు చేయడం, కాంట్రాక్టులు పొందడం చట్ట విరుద్ధం. ఇందుకోసం ఆ దేశానికి చెందిన ఫోన్లు, వ్యవస్థలను వాడుకున్నా నేరంగానే పరిగణిస్తారు. ఆ కంపెనీలపై కేసు పెడతారు. అమెరికా పెట్టుబడిదారుల నుంచి ఒక అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థనే సోలార్ ప్రాజెక్టు పేరుతో 175 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1500 కోట్లు సేకరించినట్లు ఎస్ఈసీ కేసులో పేర్కొంది. అయితే తాము ఎవరికీ లంచాలు ఇవ్వలేదని 2021, సెప్టెంబర్ నెలలోనే అదానీ చెప్పినప్పటికీ అందులో నిజం లేదని పేర్కొంది.

అయితే తమపై వచ్చిన లంచం ఆరోపణలను తోసిపుచ్చింది అదానీ గ్రూప్. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచం ఇచ్చారన్న అబియోగాలు నిరాధారమని కొట్టి పారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అతని గ్రూప్ సంస్థ పేర్కొంది. ఈ అంశంపై న్యాయస్థానాలు ఏం తేల్చుతాయో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos