వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. తాను అనుకున్నది ఒకటైతే... జరుగుతోంది మరొకటి. షర్మల తన పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు కానీ.. ఆ పార్టీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో... ఇక ఒంటరి పోరుకే సిద్ధపడాల్సిందే అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కు తుది నిర్ణయం కోసం విధించిన డెడ్ లైన్ పూర్తయింది కానీ... ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. తన పార్టీ విలీనం గురించి షర్మిల కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో .. ఇక విలీనం ప్రసక్తే ఉండదని ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు.
వైఎస్సార్టీపీ విలీనంపై ఈ నెల 30లోపు నిర్ణయం తీసుకుంటామని షర్మిల...ఐదు రోజుల క్రితం ప్రకటించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని కూడా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని కూడా షర్మిల తెలిపారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. మరోవైపు షర్మిల పార్టీని కాంగ్రెస్ లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు పార్టీ విలీనం చేసేందుకు షర్మిల కర్ణాటకకు చెందిన కీలక నేతల ద్వారా ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరిపారు. కారణాలేమో కానీ... కాంగ్రెస్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయ సమాచారం. మొన్నటి వరకు ఇదిగో విలీనం.. అదిగో విలీనం అని లీకులిచ్చిన నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం విలీనంపై అడిగితే మాట దాటవేస్తున్నారు. షర్మిల వన్ మ్యాన్ షో తప్పితే బలమైన క్యాడర్ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అయిందని చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్లో చేరుదామనుకుంటున్న షర్మిలకు హస్తం పార్టీ నుంచి వ్యతిరేకత ఎక్కువైంది. షర్మిల వర్సెస్ రేవంత్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరు వర్గాలకు ఏమాత్రం పొసగడం లేదు. షర్మిల కాంగ్రెస్లో చేరితే పార్టీకి నష్టమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్నో రోజులుగా అడ్డుకుంటున్నారు. షర్మిల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుతుందనే విషయంలో రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పలు నివేదికలు కూడా పంపించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల గతంలో ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో షర్మిల పార్టీ విలీనానికి దాదాపుగా బ్రేకులు పడినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ... కాంగ్రెస్ ముందడుగు వేసి షర్మిలతో పొత్తుకు పార్టీ ఆమెకు ఆహ్వానం పలుకుతుందా... లేక షర్మిల చొరవ చూపి తన పార్టీని కాంగ్రెస్ తో విలీనానికి మొగ్గు చూపుతుందా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos