తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ... నర్సాపూర్‌తో పాటు జనగాం.. నాంపల్లి... గోషామహల్... స్థానాల అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చకుండా ఎందుకు పెండింగ్ లో ఉంచారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంమైంది. ఈ నెల 23న మెదక్ లో సీఎం పర్యటన నేపథ్యంలోనే వీటిని పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ లో టికెట్ దక్కొచ్చని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న స్పష్టమైన హామీ పొందిన తరువాతనే ఆమె బీఆర్‌ఎస్‌లో చేరారని అంటున్నారు. కొంతకాలంగా బీసీ నినాదాన్ని వినిపిస్తున్న శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ కూడా నర్సాపూర్ బీఆర్‌ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో బీసీలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోందని ఆ వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి నర్సాపూర్ టికెట్ బీసీలకే ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు. ఒకవేళ బీసీలను పక్కనపెట్టి మరోసారి అగ్రవర్ణాలకే బీఆర్‌ఎస్ టికెట్‌ను కేటాయిస్తే పార్టీలోని బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా రెడ్లకు సీట్లను కేటాయించారు. మొత్తం 115 సీట్లలో రెడ్డి వర్గానికి 39 సీట్లను బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. అంటే 6.5 శాతం అంటే 39 సీట్లను రెడ్డి వర్గానికి కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక 37 శాతం మంది ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లను మాత్రమే కేసీఆర్ కట్టబెట్టారు. ఎస్సీలకు 19 సీట్లు, ఎస్టీలకు 11 సీట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించారు. వెలమలకు 12 సీట్లు ఇవ్వగా... కమ్మ వర్గానికి 6 సీట్లు, మైనారిటీలకు 3 సీట్లు ఇచ్చారు. ఆర్యవైశ్యులకు 1, బ్రాహ్మణులకు 1 సీటు కేటాయించారు. ఇదిలా ఉండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాత్రం ఈసారి టికెట్ కోసం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. ‘మీకు టికెట్ రాకపోతే మేము పార్టీలోనే ఉండబోం’ అంటూ నర్సాపూర్‌కు చెందిన కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసి సంఘీభావం కూడా వ్యక్తం చేశారని సమాచారం. నర్సాపూర్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో... సునీత లక్ష్మారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీఎం మెదక్ పర్యటన తర్వాతే నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. వయోభారంతో మదన్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కే అవకాశాలే లేవని బీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కానీ... అధినేత కేసీఆర్ టికెట్ ఇస్తే హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు నెలకొల్పుతానని మదన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఈ టికెట్ విషయంలో అధినేత చూపు ఎవరిపై ఉందనేది కేసీఆర్ మెదక్ పర్యటన అనంతరం తేలిపోనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos