భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందంలో మన డేటాయే కీలకమని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భారతీయుల్ని బానిసలుగా చూడొద్దని, మేమూ మీతో సమానమేనని రాహుల్ తేల్చిచెప్పేశారు. శక్తి, ఆర్దిక బలంతో ప్రపంచాన్ని మీరు శాసించే రోజులు పోయాయని ట్రంప్ కు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తో పాటు ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రానికీ రాహుల్ చురకలు అంటించారు. ఇండియా కూటమి అధికారంలో ఉండి ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ ను తమ బానిసగా కాకుండా సమానంగా చూడాలని చెప్పేదని రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికాతో కుదిరింది ఒక వికృత ఒప్పందమని అన్నారు. భారత్ - అమెరికా ఇద్దరూ వాణిజ్య ఒప్పంద నిబంధనలు ఖరారు చేయకుండా ట్రంప్ కు ఏకపక్షంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్రంపై రాహుల్ నిప్పులు చెరిగారు. ఇది అమెరికాతో భారత్ చర్చలు జరిపే అవకాశాన్ని బలహీనపర్చిందన్నారు. ట్రంప్ కు మూడు విషయాల్లో రాహుల్ ఈ సందర్భంగా మూడు సందేశాలు పంపారు. ఇందులో అతి ముఖ్యమైన విషయం భారతీయ డేటా అన్నారు. ఇండియా కూటమి ట్రంప్‌తో చర్చలు జరుపుతుంటే, తాము మొదట చెప్పేది ఏమిటంటే, మీరు మీ డాలర్‌ను కాపాడుకోవాలనుకుంటే, మేము మీ స్నేహితులం... మీ డాలర్‌ను కాపాడుకోగల అతిపెద్ద ఆస్తి భారతీయ ప్రజలతో ఉంది. మీరు ఈ డేటాను యాక్సెస్ చేయాలనుకుంటే, దయచేసి మీరు మాతో సమానంగా మాట్లాడబోతున్నారని అర్థం చేసుకోండి. మేము మీ సేవకులమని మీరు మాతో మాట్లాడబోవడం లేదన్నారు.
రెండవది భారతదేశం తన ఇంధన భద్రతను కాపాడుకుని ఉండాల్సిందని రాహుల్ తెలిపారు. కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ తన రష్యన్ చమురు కొనుగోళ్లను ఆపడానికి అంగీకరించిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యను రాహుల్ గుర్తుచేశారు. మూడో విషయం రైతుల సమస్య అని అన్నారు. ట్రంప్ కూ ఓటర్లు ఉన్నారని, తమ రైతులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్లు తమకు అర్దమవుతోందని, కానీ తామూ తమ రైతులను కూడా రక్షించుకోవాల్సి ఉందన్నారు. తాము ఈ విషయంలో పాకిస్తాన్‌తో సమానంగా ఉండలేమన్నారు. ఇప్పుడు మనం ఎవరి నుండి చమురు కొనాలో అమెరికా నిర్ణయిస్తుందని, మన ప్రధానమంత్రి కాదని రాహుల్ విమర్శించారు. మీరు భారతదేశాన్ని అమ్మేశారంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. మీకు భారతదేశాన్ని అమ్మడానికి సిగ్గు లేదా.. మీరు మన తల్లి భరతమాతను అమ్మేశారన్నారు. ప్రధాని కళ్లలో ఈ మేరకు భయం కనిపిస్తోందన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos