దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మంటలు కొనసాగుతున్న వేళ వైఎస్సార్‌సీపీ సంచలన ప్రకటన చేసింది. ఈ అంశంలో అమిత్ షాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ... ఆయన మంచిగా మాట్లాడారని ఆ పార్టీ పేర్కొనడం విస్తుగొలిపింది. ఈ క్రమంలో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని స్థాపించిన విషయాన్ని గుర్తుచేసింది. ఆ పార్టీ పెట్టిన ట్వీట్‌పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
లోక్‌సభలో 'ఏమిటి అంబేడ్కర్ అంబేడ్కర్ అని స్మరిస్తారు' అని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయే పక్షాలు మినహా కాంగ్రెస్ పార్టీతోసహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీ మినహా ఏ పార్టీ స్పందించని సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంట్రీ ఇచ్చింది. అమిత్ షా వ్యాఖ్యలను వెనకేసుకొస్తూ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.
"'అంబేద్కర్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా.. పల్లెత్తు మాట అన్నా అది తప్పే. పేదవాడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలనే అంబేద్కర్ భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తి పరిఢవిల్లేలా విజయవాడ నడిబొడ్డున అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలబెట్టి.. అద్భుతమైన స్మృతివనాన్ని నిర్మించింది. అంబేద్కర్ మాకే కాదు.. యావత్ దేశానికి ఆదర్శంగా చిరకాలం ఉంటారు"అని వైఎస్సార్‌సీపీ అధికారిక 'ఎక్స్'లో పోస్టు కనిపించింది. ఈ పోస్టును చూసినవారంతా అమిత్ షా వ్యాఖ్యలకు వైఎస్ జగన్ మద్దతు ఇస్తున్నారా.. అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడూ కూడా బీజేపీకి వంత పాడుతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీకి, అమిత్ షా కు జగన్ అన్ని విషయాల్లో మద్దతు పలుకుతారా అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. ఈ వివాదం లోకి ఎన్డీఏ మిత్ర పక్షాలను లాగేందుకు ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరి ముఖ్యంగా కీలకంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేశాయి. అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా లేదా ఖండిస్తున్నారా మీ వైఖరి ఏంటని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబుకు నిన్న లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇలాంటి అంశంపై చంద్రబాబు లాంటి వ్యక్తి లోతుగా ఆలోచించి స్పందించాలని లేఖలో పేర్కొన్నారు కేజ్రీవాల్. చంద్రబాబు ఎలా స్పందిస్తారనే ఆలోచన ప్రజల్లో ఉందని... అందుకే దీనిపై చంద్రబాబు స్పందన ఏమిటో చెప్పాలని ఆయన కోరారు.
ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా ఉండటంతో ఈ వివాదంపై స్పందించాలని ఈ ఇద్దరిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పార్టీ నేతలు, మంత్రులు నోరు జారి కొత్త సమస్యలు తీసుకురావద్దని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. పార్టీ, ప్రభుత్వం లైన్ ఏమిటో చెప్పేశారు. ఇక నితీష్ కుమార్ ఎలా స్పందిస్తారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos