పాక్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ సైన్యం క్షిపణులు ప్రయోగించడంతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. మన సైనికులు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టారు. కేవలం గంటల వ్యవధిలో గురి పెట్టి మరీ ఉగ్రవాద ప్రధాన స్థావరాలను నేల మట్టం చేసారు. సైన్యం ఆపరేషన్ పైన దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎంఐఎం అధినేత ఈ స్ట్రైక్స్ పైన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్‌కు అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇదే సమయంలో కొత్త డిమాండ్ చేసారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఒవైసీ కోరారు. పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని తెలిపారు. జై హింద్! ఆపరేషన్ సింధూర్ అని అసదుద్దీన్ ఒవైసీ పూర్తి మద్దతు పలికారు. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఒక్కసారిగా జరిగిన దాడుల్లో ఉగ్రవాదుల క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారు మరణించారు. జైషే ఈ మహ్మద్, లష్కర్ తోయిబా అగ్ర నేతలు సైతం హతం అయినట్లు తెలుస్తోంది. పాక్ తో సహా పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. బహావల్పూర్లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వార్తలు వస్తున్నాయి.
కాగా.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఎప్రిల్ నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగిన భారత్... తెల్లవారు జామున 2 గంటల సమయంలో చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై వేసింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ యుద్ధంలో భారత్‌కు మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్. అన్ని రకాలుగా అండగా ఉంటామని వెల్లడించింది. ఈ యుద్ధంలో భారత్ వైపు నిలిచిన తొలి దేశం ఇదే. పాకిస్తాన్‌పై మిస్సైళ్లను సంధించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ తెర మీదికి వచ్చింది. భారత్‌కు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు కన్నుమూసిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని వ్యాఖ్యానించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos