తెలంగాణలో రాజకీయంగా రెండు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటి జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది. ఆమె బీజేపీలో చేరేందుకు  గాను నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ...  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ రెండు రాజకీయ పరిణామాలకు ఢిల్లీ వేదిక కావడం ఆసక్తి రేపుతోంది. ముందుగా జయసుధ గురించి చర్చిద్దాం... 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. జయసుధ అక్కడ విజయం సాధించడానికి క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా మారాయనే చర్చ జరిగింది. ఈ దఫా కూడా అదే ఫార్ములా కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నందునే... బీజేపే జయసుధను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాల నుండి  పోటీ చేయాలని  ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది.  కాగా... రాష్ట్ర విభజన తర్వాత ఆమె రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. 2016లో టీడీపీలో చేరారు కానీ అక్కడ ఇమడలేకపోయారు. దీంతో 2019 మార్చి  7వ తేదీన  టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రానున్న క్రమంలో ... బీజేపీకి చెందిన కొందరు కీలక నేతలు సంప్రదింపులు జరపడంతో ... ఆమె సానుకూలంగా స్పందించారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.
ఇక.. జూపల్లి కృష్ణారావు విషయానికొస్తే...  జూపల్లి కృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మెఘా రెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిజానికి కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు. కానీ భారీవర్షాల కారణంగా జులై 20వ తేదీ, జులై 30వ తేదీన ... రెండుసార్లు ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ప్రియాంక గాంధీ సభ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే జూపల్లి ... ఇతర నేతలతో ఢిల్లీలోనే ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ నుంచి ఒకేరోజు ఇద్దరు ప్రముఖులు రెండు వేర్వేరు పార్టీల్లో చేరడాన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos