ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి దశతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప-ఎన్నికకు పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు మొదటి విడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దశలో 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా... 1.37 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో అధికార ఇండియా కూటమి, ప్రతిపక్ష ఎన్డీయే మధ్య ప్రధాన పోటీ ఉంది. జేఎంఎం 23, కాంగ్రెస్ 17, ఆర్జేడీ 5 చోట్ల పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష ఎన్డీయేలోని బీజేపీ 36, జేడీయూ 2, ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 5 స్థానాల్లో ఉన్నాయి. మాయవతి పార్టీ బీఎస్పీ 7 చోట్ల బరిలో నిలిచింది. వరుసగా రెండోసారి అధికారం కోసం జేఎంఎం-కాంగ్రెస్ కూటమి, ఐదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకోడానికి ఎన్డీయే తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఈ దశలో మాజీ సీఎం చంపయీ సోరెన్, అతడి కుమారుడు బాబూలాల్ సోరెన్, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా, మాజీ సీఎం రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా దాస్ వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప-ఎన్నిక జరుగుతున్న వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ బరిలో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయడం ఇదే మొదటిసారి. దీంతో యావత్తు దేశం ఈ ఎన్నికపై ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తోంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని మరో 31 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. రాజస్థాన్‌లో ఏడు, పశ్చిమ్ బెంగాల్‌లో ఆరు, అసోంలో ఐదు, బిహార్ నాలుగు, కర్ణాటకలో మూడు, మధ్యప్రదేశ్‌లో రెండు, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వాస్తవానికి 33 స్థానాలకు నవంబరు 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. సిక్కింలోని రెండు అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్ జరగడం లేదు.
మియాన్ సమ్మన్ యోజన సహా ప్రజాకర్షక పథకాలపై ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంటే.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే.. బంగ్లాదేశ్ చొరబాట్లు, అవినీతి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రెండో దశలో 38 సీట్లకు పోలింగ్ 20న జరగనుంది. ఈ రెండు దశల ఎన్నికలలో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఈ నెల 23న తేలిపోనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos