తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓవైపు పెద్దఎత్తున చేరికలు జరుగుతుండగా... మరోవైపున... పలువురు నేతలు బయటికి వెళ్లిపోతుండటంతో పార్టీ నాయకత్వానికి దిక్కుతోచకుండా ఉంది. పార్టీలోకి కొత్తగా తీసుకున్న నేతలకు నాయకత్వం టికెట్లివ్వడానికి సిద్ధమవుతుండగా.. ఇప్పటివరకూ పార్టీ కోసం పనిచేసిన వారు అసంతృప్తికి గురై పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉదాహరణకు మైనంపల్లి హనుమంరావు చేరిక కారణంగా మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఇన్ ఛార్జిలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిని రాహుల్ వద్దకు తీసుకెళ్లి.. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని హామీలు ఇప్పించినా ప్రయోజనం లేకపోయింది. అయితే వీరితోనే వలసలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఎంతమంది పార్టీలో చేరుతారో అంతమంది బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తాజాగా... మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాక్ గానే భావిస్తున్నారు. ఆయన ఇటీవల వెయ్యిమందికి పైగా ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన రహస్య భేటీలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని 35 సంవత్సరాలుగా పనిచేశానని... అయినా నాయకత్వం తనకు అన్యాయం చేసిందని వాపోయారు. కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరగదని... రాహుల్ గాంధీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక్క ఇంటికి ఒక్కటే టికెట్ ఇస్తామని చెప్పారని... కానీ ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజగిరి సీట్, కొడుకు మైనంపల్లి రోహిత్ కు మెదక్ సీటు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
మరోవైపు మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తనకు ఎమ్మెల్యే టికెట్ రాదనే ఆలోచనతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ పార్టీలోని అసంతృప్తులు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలోని అసంతృప్తులు మరో పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఆయా పార్టీలకు చెందిన నేతలు చేరికలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయకత్వాలకు టెన్షన్ మొదలైంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos