కర్ణాటకలో బంద్ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారు జామున బంద్ ఆరంభమైంది. క్రమంగా ముమ్మరమవుతూ వస్తోంది. బెంగళూరు సహా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులేవీ తిరగడం లేదు. కొన్ని చోట్ల పాక్షికంగా రోడ్డెక్కాయి. కర్ణాటక- మహారాష్ట్ర మధ్య సుదీర్ఘకాలంగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని 800కు పైగా గ్రామాలు తమవేనంటూ వాదిస్తూ వస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. గతంలోనూ ఈ రెండు రాష్ట్రాల్లో పలుమార్లు ఉద్యమాలు చోటు చేసుకున్నాయి.
ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో- కొద్దిరోజుల కిందటే కర్ణాటక ఆర్టీసీ బస్ కండక్టర్‌పై మహారాష్ట్రీయుడొకరు దాడి చేశారు. టికెట్ కొనే విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దాడి వరకూ వెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్వయంగా వెళ్లి ఆయనను ఆసుపత్రిలో పరామర్శించారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పడదే ఈ బంద్‌కు దారి తీసింది. కన్నడ భాషోద్యమ నాయకుడు వాటాల్ నాగరాజ్.. 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు కన్నడ భాషా ఉద్యమ సంఘాలు కదలివచ్చాయి. బంద్‌లో పాల్గొంటున్నాయి.
ఇవాళ తెల్లవారు జామున ప్రారంభమైన బంద్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులేవీ రోడ్డెక్కట్లేదు. ఓలా, ఊబర్ వంటి సంస్థలు సైతం బంద్‌లో భాగస్వామ్యం అయ్యాయి. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం వరకూ సినిమాల ప్రదర్శనను కూడా నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలేవీ పని చేయడం లేదు. ఈ క్రమంలో బెంగళూరులో మెజస్టిక్ కెంపేగౌడ బస్ స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గింది. అటు మైసూరు శాటిలైట్ బస్ స్టేషన్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. అక్కడక్కడ మినహా ప్రయాణికులెవరూ ఆ రెండు చోట్లా కనిపించట్లేదు. ఆటోలు సైతం అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రామనగర, మైసూరు, మద్దూరు, మండ్య, చామరాజనగర, కొల్లేగాల, టీ నరసీపుర, నంజనగూడు, మలవల్లి, కొడగు, హాసన వైపు వెళ్లే పాయింట్లన్నీ దాదాపుగా ఖాళీగా కనిపించాయి. హిందూపురం, అనంతపురం, మదనపల్లి, తిరుపతి వైపు వెళ్లే బస్సులూ బాగా తగ్గాయి. మంగళూరు, ఉడిపి వంటి కోస్తా తీర ప్రాంత జిల్లాలపై బంద్ ప్రభావం పడింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos