ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. శుక్ర లేదా శనివారాల్లో ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్డులో కేసు పెండింగ్లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారంటూ కవిత ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని ఆమె పిటిషన్ లో కోరారు. నళిని చిదంబరానికి ఇచ్చిన వెసులుబాటు తనకు ఇవ్వాలని కవిత తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈడీ సమన్లను వాయిదా వేయాలని ఆదేశించింది. దీంతో 26 వరకు సమన్లను వాయిదా వేసేందుకు ఈడీ అంగీకరించింది. ఈ క్రమంలో కవితకు స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు.
సుప్రీంకోర్టు ఇదివరకు కొన్ని ఆదేశాలు జారీ చేసిందని.. అందులో మహిళల్ని విచారణ కోసం ఒత్తిడి చేయవద్దని పేర్కొందని కవిత తరపు లాయర్ వాదించారు. నళిని చిదంబరం విషయంలో కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు విచారణ కోసం ఒత్తిడి చేయవద్దని కోర్టు చెప్పిందని.. ఇదే తరహా ఆదేశాలను కవితకు కూడా వర్తింప చేయాలన్నారు.
మరో కేసులో కస్టమ్స్ యాక్ట్ అంశంలోనూ మహిళలపై కఠినంగా వ్యవహరించవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని కవిత తరపు లాయర్ అన్నారు. మనీలాండరింగ్ చట్టంలో కూడా మహిళలకు రక్షణ కల్పించాలని చెబుతోందని.. బెయిల్ కోసం ఉద్దేశించిన సెక్షన్ 45లో కూడా మహిళలకు వెసులుబాటు కల్పించాలని ఉందని కవిత తరపు లాయర్ తెలిపారు. కాబట్టి మహిళలను ప్రత్యేక కేటగిరీగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై తుది ఉత్తర్వులు వెలువడాలి. ఫైనల్ హియరింగ్ కోసం డేట్ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు ఈ సమన్లను వాయిదా వేయాలని కోరారు.
ఈడీ తరపు లాయర్ స్పందిస్తూ... కవిత ఇప్పుడు బిజీగా ఉంటే, మరో 10 రోజులు సమయం పొడిగిస్తామని తెలిపారు. అంతే తప్ప సమన్లను నిరవధికంగా వాయిదా వేయడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. కాగా... లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు సెప్టెంబర్ 14న మరోసారి నోటీసులిచ్చింది. సెప్టెంబర్ 15న విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని కవిత ఇంటికి నోటీసులు పంపగా..మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కవితనీ ఈడీ అధికారులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు సార్లు విచారించింది. ఈ క్రమంలో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 26వ తేదీకి వాయిదా వేయడంతో ఆమెకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos