తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో.. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సరంజామా సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఆ పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. వచ్చే ఆదివారం అంటే ఈ నెల 15న.. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ లో ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు. అదేరోజు ఉదయం ఆయన.. పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వారందరికీ బి-ఫారాలు అందజేయనున్నారు. ఆ రోజు సాయంత్రం.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు.


అక్టోబరు 16న భువనగిరి, జనగామ నియోజకవర్గ కేంద్రాల్లో... 17న సిద్దిపేట, సిరిసిల్లలో... 18వ తేదీ మధ్యాహ్నం జడ్చర్లలో, అదేరోజు సాయంత్రం మేడ్చల్‌లో పార్టీ నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. కాగా.. జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఈ నెల 15న బీఫారం అందించనున్నట్టు సమాచారం. ఈసారి గజ్వేల్‌, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. నవంబరు 9న ఆ రెండు చోట్లా నామినేషన్‌ వేయనున్నారు. ఆనవాయితీ ప్రకారం.. సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తొలుత గజ్వేల్‌లో నామినేషన్‌ సమర్పించి, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్‌ వేయనున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ కు దైవభక్తే కాకుండా సెంటిమెంట్లు కూడా ఎక్కువే. వాటిని బాగా నమ్ముతారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావించారు. అందువల్లనే ఈ నెల 15న హుస్నాబాద్‌లో తొలి ప్రజాఆశీర్వాద సభతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో.. అంటే 2018 సెప్టెంబరు 7న ఆయన ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించడం గమనార్హం. ఆ సభ విజయవంతమైంది. ఆ స్ఫూర్తితో మిగతా బహిరంగసభలు సక్సెస్‌ కావడం, ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి రెండోసారి అధికారంలోకి రావడంతో.. కేసీఆర్‌ హుస్నాబాద్‌ను సెంటిమెంట్‌గా కేసీఆర్‌ భావిస్తున్నారు. అంతేగాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు హుస్నాబాద్‌ ఈశాన్యం దిక్కున ఉంటుందనే మరో సెంటిమెంట్‌ను సైతం ఆయన బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లోనూ ఈశాన్యం నుంచే ప్రచారం ప్రారంభించాలనే ఉద్దేశంతో హుస్నాబాద్‌పై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఈసారి కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. నాడు హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభను అన్నీతానై విజయవంతం చేసిన మంత్రి హరీశ్‌రావుకే ఈసారీ సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. సో... కేసీఆర్ ఈ నెల 15న ఎలెక్షన్ గేమ్ స్టార్ట్ చేయబోతున్నారని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos