రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ అపర మేధావి.. అపర చాణుక్యుడు గా పేరున్న కేసీఆర్ ... వ్యూహాలు రచించడంలో దిట్ట అనే విషయం తెలిసిందే. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ... ప్రత్యర్థి పార్టీలను ఈజీగా బోల్తా కొట్టించేస్తారు. సూటిగానే పదునైన మాటలతో... టార్గెట్ చేసి ఏకిపారేస్తారు. ఆయన తీసుకొనే కొన్ని నిర్ణయాలు ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇదంతా ఎందుకంటే... తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ ... హ్యాట్రిక్ సాధించే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్ధుల ఎంపికపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. షెడ్యూల్ సమయంలో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చే అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇక, ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్షాలను డైలమా లో పడేయటమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా రేస్ గుర్రాలపై ఫోకస్ పెట్టడమే కాదు... మార్చాల్సిన అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చేశారన్న చర్చ నడుస్తోంది. తొలి జాబితా కూడా రెడీ అయిపోయిందన్న వార్తలు ఇటీవల వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏకంగా ఓ జాబితా కూడా తెగ చక్కర్లు కొడుతోంది. 80 మందికి పైగా అభ్యర్థులతో కూడిన జాబితాను ఏ క్షణంలోనైనా ప్రకటించి… ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసరబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తాజా నిర్ణయాలతో దాదాపు కోటి మంది ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షాలు వీరికి కొత్తగా హామీలు ఇచ్చే అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పైన విజయం మాదేనంటూ కొద్ది కాలం క్రితం వరకూ బీజేపీ చెబుతూ వచ్చింది. ఆ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత పరిణామాలతో బీజేపీ ఇప్పుడు పూర్తిగా వెనుకబడింది. కర్ణాటక తరువాత తమ లక్ష్యంగా తెలంగాణ అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. హైకమాండ్ నేతలు తెలంగాణ పైనే ఫోకస్ చేశారు. మేనిఫెస్టోలో ఆకర్షణీయ హామీల ప్రకటనకు కసరత్తు చేస్తోంది. కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయని రుణమాఫీని అస్త్రంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఈ సమయంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. కేవలం నెల రోజుల సమయంలో 12 నిర్ణయాలను ప్రకటించారు. ఇదే సమయంలో ఉద్యోగులకు ఆకట్టుకొనేందుకు పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటనకు సిద్ధం అవుతున్నారు. దీనిద్వారా పదేళ్ల పాలన పైన సహజంగానే ఏర్పడే ఎంతో కొంత వ్యతిరేకతను అధిగమించి పాజిటివ్ ఓటు బ్యాంక్ తో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.  మరోవైపు... 2018లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్... ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా... ఏకంగా 90 మందికిపైగా అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా ప్రకటించారు. ఇక ఈసారి కూడా మరికొద్ది నెలల సమయం ఉండగనే గులాబీ పార్టీ తరపున బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో ఉండే సిట్టింగ్‌లు ఎవరు.. ఆశావహుల్లో ఎవరెవరికి టికెట్ దక్కుతుందన్న చర్చ గులాబీ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో.. మంచి ముహూర్తం చూసుకొని ఏ క్షణమైనా తొలి జాబితాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos