ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే విడతలో ... మొత్తం 119 స్థానాల్లో 115 స్థానాలకు తన పార్టీ అభ్యర్దులను ప్రకటించి... ఎన్నికల సమరశంఖం పూరించారు. ఏడు స్థానాల్లో సిట్టింగ్ లకు నో ఛాన్స్ అని చెప్పిన కేసీఆర్... మరో నాలుగు స్థానాలను మాత్రం ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఇదే సమయంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. గజ్వేల్‌, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్‌ నిరాకరించినట్లు సీఎం చెప్పారు.
వైరా, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీ9ఎం కేసీఆర్ వివరించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాన్ని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని వెల్లడించారు. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి టికెట్లు హోల్డ్‌లో పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచి సిట్టింగ్ లకే ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ వచ్చారు. చివరకు అదే చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నిరాశ కలిగించకుండా... వారికీ సీట్లు కేటాయించారు.
పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్తారని భావించిన వారిని కట్టడి చేశారు. ఇదే సమయంలో నాలుగు స్థానాలపైన కేసీఆర్ నిర్ణయం పెండింగ్ లో పెట్టారు. అందులో గోషామహల్ ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ కారణంగానే ఈ సీటు పైన అభ్యర్ది ప్రకటన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో 95 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  
ఇదిలావుండగా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో  పొత్తు ఉండదని ... ఇవాళ కేసీఆర్ ప్రకటించిన జాబితాను బట్టి తేలింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళతామని  లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. అయితే  పొత్తు విషయమై బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం పొత్తు లేదని తేల్చి చెప్పింది. గతంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. లెఫ్ట్ పార్టీల మద్దతుతో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ విజయం సాధించింది.  
లెఫ్ట్ పార్టీల మద్దతు లేకపోతే  బీఆర్ఎస్ అభ్యర్థి విజయం అసాధ్యమని ఆనాడు ప్రత్యర్థి పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ తో  పొత్తు  కొనసాగుతుందని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. రానున్నఎన్నికల్లో కనీసం నాలుగు నుండి ఐదు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ ను కోరిన క్రమంలో... రెండు పార్టీలకు ఒక్కొక్క అసెంబ్లీ స్థానం టికెట్ ను మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధపడింది. దీంతో ఆ పార్టీల మధ్య పొత్తుల విషయమై ప్రతిష్టంభన నెలకొంది. ఇవాళ కేసీఆర్  115 అభ్యర్థులను ప్రకటించడం ద్వారా లెఫ్ట్ పార్టీలతో  పొత్తు లేదని చెప్పకనే చెప్పారు.  కేసీఆర్ నిర్ణయంపై  లెఫ్ట్ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos